పనిచేస్తున్న సంస్థకే కన్నం..భార్య, బావమరిది పేర్లతో పే రోల్స్‌.. రూ.2 కోట్లు స్వాహా

Hyderabad: Man Cheats On His Company And Dumped 2 crores - Sakshi

ఉద్యోగుల పేర్లతో రూ.2 కోట్లు స్వాహా

సాక్షి, హిమాయత్‌నగర్‌: పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. లేని ఉద్యోగులు ఉన్నట్లు చూపి సంస్థకు సంబంధించిన డబ్బును జీతాల రూపంలో కుటుంబ సభ్యుల అకౌంట్‌లో జమ చేసుకున్నాడు. ఏడాదిన్నర పాటు కోట్ల రూపాయిలు కొట్టేసి ఇటీవల ఉద్యోగం మానేయడంతో.. తోటి ఉద్యోగి ఈ విషయాన్ని యజమాన్యానికి తెలిపాడు. దీంతో విషయం బయటపడి సిటీ సైబర్‌క్రైం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం..హబ్సిగూడలోని ఓ  ‘యాప్‌ అప్లికేషన్‌’ కంపెనీలో నగరానికి చెందిన యువకుడు అకౌంట్స్‌లో పనిచేస్తున్నాడు. సంస్థలో ఉద్యోగం చేయకపోయినప్పటికీ చేస్తున్నట్లుగా తన భార్య, బావమరిది, మరో కుటుంబసభ్యుడు, తోటి ఉద్యోగుల పేర్లతో నకిలీ పే రోల్స్‌ తయారు చేశాడు.

వాటిపై ఏడాదిన్నరగా వారు జీతం తీసుకుంటున్నట్లు రూ.లక్షా 60వేలు కాజేశాడు. మరలా జీఎస్టీ పేరుతో సంస్థ నుంచి రూ.46 లక్షలు స్వాహా చేశాడు. మొత్తంగా ఏడాదిన్నరలో రూ.2 కోట్ల 6 లక్షలు కొట్టేసి ఉద్యోగం మానేశాడు. ఆయన ఉద్యోగం మానేసిన తర్వాత ఈ విషయాన్ని ఓ ఉద్యోగి యజమాన్యానికి లీక్‌ చేశాడు. వారు అకౌంట్స్‌ సరి చూసుకొని, కంపెనీలో చేయకపోయినా చేస్తున్నట్లు పే రోల్స్‌ క్రియేట్‌ చేసి డబ్బు కొట్టేశాడని కంపెనీ డైరెక్టర్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. 
చదవండి: గ్యాస్‌, పెట్రోల్, డీజిల్, విద్యుత్, వంట నూనెలు, చికెన్, పచ్చిమిర్చి.. తగ్గేదేలే!

ఇన్సూరెన్స్‌ పేరుతో రూ. 3.5 కోట్లకు టోకరా
హిమాయత్‌నగర్‌: ఇన్సూరెన్స్‌ పేరుతో మోసగించిన ముగ్గురిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. మోతీనగర్‌కు చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి రామరాజును ఇన్సూరెన్స్‌ చేసుకోవాలంటూ ముగ్గురు స్నేహితులు వెంటపడ్డారు. పదే పదే కాల్స్‌ చేస్తుండటంతో రామరాజు విడతల వారీగా వీరికి రూ.3 కోట్ల 50 లక్షలు చెల్లించి ఇస్సూరెన్స్‌ తీసుకున్నాడు.  డబ్బు కట్టిన తర్వాత వచ్చే పత్రాలను రామరాజు అమెరికాలో ఉన్న తన కుమారుడికి పంపాడు. ఆ కంపెనీకి చెందిన అధికార వెబ్‌సైట్‌లో తండ్రి రామరాజు వివరాలు ఏవీ లేవు. దీంతో అనుమానం వచ్చి తన తండ్రి రామరాజుకు చెప్పాడు.

దీనిపై ఇన్సూరెన్స్‌ డబ్బు తీసుకున్న కరీంనగర్‌కు చెందిన మనోజ్, వనపర్తికి చెందిన మహేష్‌గౌడ్, ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన సుబ్రహ్మణ్యంను నిలదీశాడు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో ఇటీవల సీసీఎస్‌ పోలీసులకు  ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి ఈ ముగ్గురినీ శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top