లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్‌లో దారుణం జరిగింది. డబ్బులు, దైవానుగ్రహం కోసం ఇద్దరు యువకులు తన స్నేహితుణ్ని హత్య చేశారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
పోలీసుల వివరాల మేరకు.. ఘాజియాబాద్‌లోని లోనీ ప్రాంతానికి చెందిన నందు అలియాస్ నవీన్ అనే యువకుడు జనవరి 13వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో దారుణంగా హత్యకు గురయ్యాడు. నిందితులు పవన్ (25), సాగర్ అలియాస్ పండిట్ (24) తమ స్నేహితుడిని గ్యాస్ సిలిండర్‌తో దాడి చేసి చంపారు. అనంతరం శవాన్ని దాచిపెట్టేందుకు దాన్ని దుప్పట్లో చుట్టి బ్యాటరీతో నడిచే ఆటోలో పెట్టి, ఆ ఆటోను కాల్చివేశారు. ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి ప్రమాదానికి గురైందని నమ్మించే ప్రయత్నించాడు.
అయితే, బాధితుడి సోదరుడు ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, స్థానిక సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మరో నిందితుడు నసీమ్ అలియాస్ ఇక్బాల్ పరారీలో ఉండగా.. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పోలీసుల దర్యాప్తులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. వారు ఒక తాంత్రికుడిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఆ తాంత్రికుడు మానవ బలి ఇస్తే సంపద, దైవానుగ్రహం లభిస్తుందని చెప్పాడు. ఈ మాటలకు ప్రభావితులైన నిందితులు తమ స్నేహితుడినే బలిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధంగా నందును హత్య చేసి, శవాన్ని కాల్చివేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులిద్దరికీ గతంలోనే హత్య, దోపిడీ, ఆయుధాల చట్టం ఉల్లంఘన కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.


