పరువు హత్యలు.. నాడు నరేశ్, ప్రణయ్‌.. నేడు రామకృష్ణ

Honour Killing Incidents In Nalgonda Pranay Naresh And Now Rama Krishna - Sakshi

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో పరువు హత్య కలకలం

ఆరేళ్లలో ముగ్గురు యువకుల బలి

చర్చనీయాంశమవుతున్న హత్యలు

సాక్షి, యాదగిరిగుట్ట/వలిగొండ : ఉమ్మడి జిల్లాలో మరో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. నాడు నరేశ్, ప్రణయ్‌లు పరువుకు బలి కాగా అదే తరహాలో నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎరుకల రామకృష్ణను దారుణంగా మట్టుబెట్టారు. ఆరేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు యువకులు హత్యకు గురికావడం చర్చనీయాంశంగా మారింది.

అమ్మమ్మ ఇంటి వద్ద చదువుకుని..
సిద్దిపేట జిల్లా లకుడారంలో పరువు హత్య కాబడిన రామకృష్ణ వలిగొండ మండలం లిగంరాజుపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద నివాసముండేవాడు. ఇతడి స్వస్థలం హుజూర్‌నగర్‌. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో రామకృష్ణ కుటుంబ సభ్యులు అమ్మమ్మ ఊరైన లింగరాజుపల్లికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు.రామకృష్ణకు తల్లి కలమ్మ, చెల్లి నాగలక్ష్మి, తమ్ముడు రమేష్‌ ఉన్నారు. రామకృష్ణ ఇంటర్‌ వరకు వలిగొండలో చదువుకున్నాడు. 2016వ సంవత్సరంలో హోంగార్డుగా ఉద్యోగం సాధించి కొంతకాలం వలిగొండలోనే విధులు నిర్వహించారు.  2019లో యాదగిరిగుట్టకు బదిలీ అయ్యాడు. 

ఎవరీ వెంకటేశ్‌
యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన వెంకటేష్‌ ప్రస్తుతం రాజాపేట మండలం కాల్వపల్లి వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. మొదటగా పల్లెపాటి వెంకటేష్‌ సొంత గ్రామమైన గౌరాయపల్లిలో మస్కూరిగా విధులు నిర్వహించాడు. వెంకటేష్‌ 10వ తరగతి పూర్తి కాకపోవడంతో గ్రామంలోనే వీఆర్‌ఏగా పని చేశాడు. ఈ సమయంలోనే 10వ తరగతి పరీక్షలు రాసి వీఆర్‌ఓగా ఉద్యోగం సాధించాడు. అనంతరం రాజాపేట తహసీల్దార్‌ కార్యాలయంలో  కాల్వపల్లిలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ విధులు నిర్వహిస్తూనే.. సొంత గ్రామమైన గౌరాయపల్లి నుంచి యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరాంనగర్‌కు వచ్చి ఇల్లు నిర్మించుకున్నాడు. ఐదేళ్లుగా వెంకటేష్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టలోని సొంత ఇంట్లో ఉంటున్నాడు. వెంకటేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె భార్గవి ఉన్నారు. భార్గవి 2020లో ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వెంకటేష్, ఆయన భార్య, కుమారులు గుట్టలో ఉంటున్నారు. వెంకటేష్‌ వీఆర్‌ఓ ఉద్యోగంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. 

గుప్త నిధుల తవ్వకాల్లో..
యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా ఉంటూ పోలీస్‌ వాహనం నడుపుతున్న సమయంలో రామకృష్ణకు   తుర్కపల్లి మండలంలోని ఓ గ్రామంలో గుప్త నిధులు తవ్వకాల సమయంలో కాల్వపల్లి వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో గుప్త నిధులు తవ్వకాలు జరిగే బృందంలో హోంగార్డు రామకృష్ణపై కేసు నమోదు కాగా.. ఆ కేసులో ని«ంధితుడుగా ఉన్న వీఆర్‌ఓ వెంకటేష్‌ను ఆ కేసులో నుంచి అప్పట్లో పోలీసులు తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గుప్త నిధుల కేసులోనే రామకృష్ణను హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించారు.

ఇంటర్‌ నుంచే..
యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణకు భార్గవి ఇంటర్‌ మొద టి సంవత్సరం చదువుతున్న క్రమంలో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలో రామకృష్ణ స్థానికంగా ఉండే పోలీస్‌ క్వాటర్స్‌లో ఉండే వాడు. ఆ తర్వాత పోలీస్‌ క్వాటర్స్‌లో గదిని ఖాళీ చేసిన రామకృష్ణ ప్రేమించిన భార్గవితో మరింత దగ్గర అయ్యేందుకు శ్రీరాంనగర్‌లో భార్గవి తండ్రి వీఆర్‌ఓ వెంకటేష్‌ నిర్మించుకున్న ఇంటికి ముందు ఉన్న ఓ ఇంట్లో అద్దెకు తీసుకొని ఉన్నాడు. ఈ తరుణంలోనే వెంకటేష్, రామకృష్ణలు ఇ ద్దరు తుర్కపల్లి మండలంలోని ఓ గ్రామంలో జరిగిన గుప్త నిధుల తవ్వకాల్లో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. 

ఒప్పుకోకున్నా..
రామకృష్ణ, భార్గవిల వివాహం 2020 ఆగస్టు 16న చెర్వుగట్టులో జరిగింది. అంతకు నెల రోజుల ముందే భార్గవి, రామకృష్ణల ప్రేమ వ్యవహారం వెంకటేష్‌తో పాటు కుటుంబ సభ్యులు తెలిసింది. దీంతో వెంకటేష్‌ తన కూతురు భార్గవిని మందలించాడు. ఈ సమయంలో తనకు రామకృష్ణ అంటే ఇష్టమని తండ్రి వెంకటేష్‌తో భార్గవి చెప్పింది. కళాశాలకు వెళ్లనివ్వకుండా వెంకటేష్‌ కుమార్తె భార్గవిని ఇంట్లోనే ఉండమన్నాడు. రామకృష్ణపై ఉన్న ప్రేమతో భార్గవి 2020 ఆగస్టు 16న చెర్వుగట్టులో వివాహం చేసుకున్నారు.  
10రోజుల క్రితం గుట్టలోనే..
రామకృష్ణ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ భువనగిరితో పాటు యాదగిరిగుట్టలో భూములు అమ్మకా లు, కొనుగోలు చేసేందుకు వచ్చేవాడని స్థానికులు  పేర్కొంటున్నారు. 10రోజుల క్రితం ఎకరం భూమి కావాలని ఓ వ్యక్తితో యాదగిరిగుట్టకు వచ్చాడని తెలిసింది. అంతే కాకుండా  రెండు, మూడు రోజుల క్రితం పట్టణంలోని గాయత్రి హోటల్‌లో భోజనం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఐదేళ్లుగా హోంగార్డుగా యాదగిరిగుట్టలోనే విధులు నిర్వహించిన రామకృష్ణకు స్థానికులతో మంచి పరిచయాలు ఉన్నాయి.  

సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య
మిర్యాలగూడ అర్బన్‌: 2018 సెప్టంబర్‌ 14న మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్‌ కేసు అప్పట్లో దేశంలోనే సంచలనం సృష్టించింది. తిరునగరు మారుతీరావు కూతురు అమృత మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డి కుంటకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్‌  స్కూల్లో విద్యనబ్యసించే నుంచి ప్రేమించకున్నారు. ఇద్దరూ ఒక్కటై కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ విషయం నచ్చని అమృత తండ్రి మారుతీరావు పరువు పోయిందని భావించి అప్పటినుంచి అదును కోసం వేచి చూశాడు. అమృత ఐదు నెలల గర్భవతి కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి భర్త, అత్తతో కలిసి వచ్చింది.  వైద్య పరీక్షలు ముగించుకుని ఆస్పత్రి నుంచి బయటికి వస్తున్న క్రమంలో వెనుకనుంచి వచ్చిన సుపారీ కిల్లర్‌ పదునైన కత్తితో ప్రణయ్‌ను దారుణంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తిరునగరు మారుతీరావు కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్‌లోని ఆర్యసమాజ మందిరంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

నమ్మించి.. మట్టుబెట్టి..
ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌(ఎం) మండలం పల్లెర్లలో రజక కులానికి చెందిన అంబోజు నరేష్, లింగరాజుపల్లిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తుమ్మల స్వాతి ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో భయపడి తలదాచుకోవడానికి 2016లో ముంబాయికి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేస్తామని అమ్మాయి తల్లిదండ్రులు నమ్మించి ఇద్దరినీ స్వగ్రామానికి రప్పించారు. వారం రోజులకు స్వాతి తన ఇంట్లోని బాత్‌రూంలో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన జరిగిన ఐదారు రోజుల్లో అంబోజు నరేష్‌ అదృశ్యం అయ్యాడు.

దీంతో నరేష్‌ తల్లిదండ్రులు భువనగిరి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్వాతి కుటుంబంపై అనుమానం ఉండడంతో అప్పటి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజాసంఘాల కలిసి హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. మానవ హక్కుల కమిషన్‌ సీరియస్‌గా స్పందించడంతో పోలీసులు  విచారణ చేపట్టారు. కాగా నరేష్‌ను అదే ఏడాది మే నెలలో కిడ్నాప్‌ చేసి లింగరాజుపల్లి శివారులో వ్యవసాయ బావి వద్ద హత్య చేసి దహనం చేసినట్లు స్వాతి తండ్రి అంగీకరించారు. పోలీసులు ఆ కోణంలో తిరిగి విచారణ చేపట్టారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు నిలబడలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top