Cyber Crime: Teens To Seniors In Digital Honey Trap, Check Details Inside - Sakshi
Sakshi News home page

Honey Trap: మైనేమ్‌ ఈజ్‌ సుజి, ఐ యామ్‌ సింగిల్‌.. అంటూ అందంగా మాట్లాడుతారు

Published Wed, Dec 29 2021 10:16 AM | Last Updated on Thu, Dec 30 2021 7:14 AM

Honey Trap: Teens To seniors In Digital Honey Trap - Sakshi

సాక్షి, నిర్మల్‌: ‘హాయ్‌..మైనేమ్‌ ఈజ్‌ సుజి(పేరు మార్చాం). వాట్‌ ఈజ్‌ యువర్‌ నేమ్‌. వేర్‌ ఆర్‌ యు ఫ్రమ్‌. ఐ యామ్‌ సింగిల్‌...’ అంటూ ప్రవీణ్‌(పేరు మార్చాం) అనే యువకుడి మెసెంజర్‌లో ఒక మెసెజ్‌ వచ్చింది. పేరు కొత్తగా ఉండటంతో పాటు అందమైన అమ్మా యి ఫొటో డీపీగా ఉండటంతో మెసెంజర్‌ ఓపెన్‌చేసి, తాను కూడా చాట్‌ చేయడం మొదలు పెట్టాడు. కాసే పటికే ఎదుటి యువతి ఫోన్‌ నంబర్‌ చెప్పు, వీడియో కాల్‌ చేస్తాను అనటంతోనే.. ఏమాత్రం ఆలోచించకుండా ప్రవీణ్‌ వెంటనే తన నంబర్‌ను పంపించాడు. సెకన్ల వ్యవధిలోనే గుర్తుతెలియని ఓ కొత్త నంబర్‌ నుంచి ఆయనకు వాట్సప్‌ ద్వారా వీడియోకాల్‌ వచ్చింది.

లిఫ్ట్‌ చేసేసరికి.. నిజంగానే ఓ అందమైన యువతి లైన్‌లోకి వచ్చింది. ‘హాయ్‌..’ అంటూ స్వీట్‌గా ఇంగ్లిష్‌లో మాట్లాడటం మొదలుపెట్టింది. అతడూ వచ్చీరాని ఇంగ్లిష్‌తో మాట్లాడాడు. కాసేపటికే ఆమె అసభ్యకరంగా మాట్లాడటం, దుస్తులు తొలగించడం చేసింది. తనను కూడా అలాగే చేయాలని చెప్పడంతో.. వెనుకాముందు ఆలోచించకుండా తీసేశాడు. కాసేపటికే.. వీడియోకాల్‌ కట్‌ అయ్యింది. అంతే.. ప్రవీణ్‌ దుస్తులు సర్దుకునేంత లోపే వాట్సప్‌లో ఒక వీడియోతోపాటు ఒకదాని వెంట ఒకటి మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. వాటిని చూడటంతోనే ప్రవీ ణ్‌ ఒక్కసారిగా బిత్తరపోయాడు. అప్పటి దాకా వారు మాట్లాడుకున్న వీడియోకాల్‌ మొత్తం రికార్డు చేసి, తనకు పంపించారు. ‘దుస్తులు లేకుండా మనం ఇద్దరం మాట్లాడుకున్న వీడియో మొత్తం రికార్డు అయ్యింది. నువ్వు వెంటనే మా గూగుల్‌పే నంబర్‌కు రూ.50 వేలు పంపించు.
చదవండి: ఇప్పుడే వస్తానమ్మా... అంటివి కదా కొడుకా!

లేదంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులందరికీ పంపిస్తాను. సోషల్‌ మీడియాలలో పోస్టు చేస్తాను. వెంటనే డబ్బు పంపించు.. లేదంటే.. అంతే సంగతి..’అంటూ వరుసగా మెసెజ్‌లు వచ్చాయి. దీంతో ప్రవీణ్‌ ఒక్కసారిగా బెదిరిపోయాడు. ఏం చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో.. తెలియక కంగారుతో జ్వరం తెచ్చుకున్నాడు. చివరికి దగ్గరి మిత్రుడి సలహాతో వారి ఫోన్లు లిఫ్డ్‌ చేయడం, మెసేజ్‌లు చూడటం చేయడం లేదు. రెండు రోజులైనా ఇంకా ఆ ఘటన నుంచి తేరుకోవడం లేదు. ఒక్క ప్రవీణ్‌కే కాదు.. జిల్లాలో చాలామంది ‘హనీట్రాప్‌’కు గురవుతున్నారు. ఇలాంటి పలు రకాల సైబర్‌ ఉచ్చులతో పలు ముఠాలు వివిధ వయసుల వారిని టార్గెట్‌ చేస్తున్నాయి. మాటలతో మాయచేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి.
చదవండి: ఐటీ కంపెనీలపై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. ఇంకొంత కాలం ఇంటి నుంచే! 

మాట కలిపి..మాయ చేస్తూ
‘హనీట్రాప్‌’.. ఇటీవల ఈ ఉచ్చు బిగించేవారి సంఖ్య పెరుగుతోంది. అందమైన యువతులను ముందు ఉంచి కొన్ని సైబర్‌ దోపిడీ ముఠాలు ఉచ్చులు పన్నుతున్నాయి. సదరు యువతులు ముందు స్వీట్‌గా పలకరిస్తూ.. మాటల్లోకి దించుతున్నారు. తమ దుస్తులను తొలగిస్తూ.. మెల్లగా ఉచ్చులోకి దించి, ఎదుటి వ్యక్తిని కూడా అసభ్యకరంగా తయారయ్యే దాకా వేచి చూస్తున్నారు. ఇదంతా స్పైవేర్‌తో రికార్డు చేసి, ఆ తర్వాత బెదిరింపులకు దిగుతున్నారు. సదరు అమ్మాయిని ముందుండి కథ నడించిన ముఠా రంగంలోకి దిగి, డబ్బులు డిమాండ్‌ చేస్తోంది. లేదంటే నీ వీడియో మొత్తం యూట్యూబ్, సోషల్‌ మీడియాల ద్వారా అందరికీ పంపిస్తామంటూ బెదిరిస్తోంది.
చదవండి: అంబులెన్స్‌ లేదు.. పీహెచ్‌సీకి తాళం.. ఆటోలోనే ప్రసవించిన మహిళ

యువతే లక్ష్యంగా...
ప్రధానంగా యువతనే లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ముఠాలు సైబర్‌నేరాలకు పాల్పడుతున్నాయి. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలను పరిశీలిస్తే.. బాధితులంతా 25 నుంచి 28ఏళ్లలోపు వారే ఉన్నారు. ఇందులో పెళ్లికాని వాళ్లు, పెళ్లికి దగ్గరి వయసులో ఉన్నవారినే సదరు ముఠాలు టార్గెట్‌ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి వారైతేనే.. పెళ్లి కావాల్సిన వయసులో ఇలాంటి వీడియోలు బయటకు వస్తే తన పరువు పోవడంతోపాటు పెళ్లికి ఇబ్బంది అవుతుందన్న భయంతో ఎంత అడిగితే అంత డబ్బు ఇస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. కొంతమంది పెళ్లయిన వారు కూడా ఎక్కడ తమ బండారం భార్య కు తెలుస్తుందోనన్న భయంతో సదరు ముఠాలకు ఎంత అడిగితే అంత ముట్టజెప్పిన ఘటనలూ ఉన్నాయి. 

సోషల్‌మీడియా ద్వారా..
సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న చాలా ముఠాలు సోషల్‌ మీడియా నుంచే తమ టార్గెట్‌లను ఎంచుకుంటున్నాయి. ప్రధానంగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాంలలో పూర్తి ప్రొఫైల్‌ను పెట్టడం, ఫ్రెండ్స్‌ గురించి ఉండటంతో సదరు వ్యక్తి ఎలాంటివాడు, ఆయన వెనుకాముందు ఏముందనేది మొత్తం తెలిసిపోతోంది. వారిలో తమ పనికి సులువుగా దొరికి పోయేవాడు, డబ్బులు పంపించేవాడిని ఎంచుకుంటున్నారు. ముందు మెసెజ్‌లతో బెదిరిస్తున్నారు. లేనిపక్షంలో నేరుగా కాల్‌ చేసి భయపెట్టిస్తున్నారు. పోలీసులకు ఫోన్‌చేసినా, స్టేషన్‌కు వెళ్లినా వెంటనే మీవాళ్లకు ఈ వీడియోలు షేర్‌ చేస్తామని హెచ్చరిస్తుండటంతో చాలామంది గుట్టుగా ఎంతోకొంత డబ్బులు ముట్ట జెప్పుతున్నట్లు తెలుస్తోంది. కానీ.. ఇలాంటి ముఠాలు ఒకసారి డబ్బు తీసుకోవడంతోనే వదిలిపెట్టవని, తరచూ అడుగుతూనే ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటన ఏది జరిగినా వెంటనే స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement