రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రోన్‌ స్వాధీనం

Heavy Amount of Drugs Seized In Medchal District - Sakshi

క్యాబ్‌ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి విచారించగా, వెలుగులోకి నిజాలు.. 

కుత్బుల్లాపూర్‌: డ్రగ్స్‌ సరఫరా చేస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్న ఓ ముఠాకు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చెక్‌ పెట్టారు. మేడ్చల్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు రూ.2 కోట్ల విలువైన 5 కిలోల మెఫిడ్రోన్‌/మిథాంఫిటమిన్‌ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

మేడ్చల్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రయ్య, మేడ్చల్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ విజయభాస్కర్‌ శనివారం ఈ వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లి న్యూ బాలాజీనగర్‌లోని ఎస్‌వీ సెలెక్షన్‌ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్‌ తీసుకోవడం తీసుకోవడంతోపాటు విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న మేడ్చల్‌ జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యులు దాడులు నిర్వహించారు. 

రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్‌..  
ఈ దాడుల్లో క్యాబ్‌ డ్రైవర్‌ పవన్‌ అలియాస్‌ చిటుకూరి ప్రశాంత్‌రెడ్డి పట్టుబడ్డాడు. అతడి వద్ద 5 గ్రాముల మత్తు పదార్థం లభించింది. అదుపులోకి తీసుకుని విచారించగా, కన్నారెడ్డి అలియాస్‌ మహేశ్‌ కన్నారెడ్డి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో బొంగులూర్‌ గేటు సమీపంలోని గురుదత్తా లాడ్జిపై దాడులు చేయగా కన్నారెడ్డి పట్టుబడ్డాడు. అతడి వద్ద 921 గ్రాముల మెఫిడ్రోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దీంతోపాటు ఈ వ్యవహారంతో సంబంధమున్న నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మరాజ్‌పేట మండలం బావాజీపల్లి గ్రామానికి చెందిన కొండమూరి రామకృష్ణగౌడ్‌ ఇంటిపై దాడులు చేశారు. అతడి వాహనాన్ని తనిఖీలు చేయగా, 4 కిలోల మెఫిడ్రోన్‌ పట్టుబడింది. బావాజీపల్లికి చెందిన బండారు హన్మంత్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి అలియాస్‌ ఎస్‌.కె.రెడ్డి తనకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు అతను చెప్పారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో ఓ ఫార్మా కంపెనీలో కెమిస్ట్‌గా పనిచేసిన ఎస్‌.కె.రెడ్డి పటాన్‌చెరులో ఓ మూతబడిన పరిశ్రమను అడ్డాగా చేసుకుని డ్రగ్స్‌ సరఫరాకు పాల్పడుతున్నట్లు సమాచారం.

కాగా, కుత్బుల్లాపూర్, బాలానగర్, మేడ్చల్‌ ప్రాంతాల్లోని ఇంజినీరింగ్‌ కాలేజీల వద్ద నిఘా ఏర్పాటు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు లేదా తీసుకుంటున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, తగిన నగదు పారితోషికం అందిస్తామని అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top