గగన్‌ అగర్వాల్‌ హత్యకేసు: వెలుగులోకి కీలక విషయాలు

Gagan Agarwal Assassination Case ACP Revealed Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వనస్థలిపురానికి చెందిన గగన్‌అగర్వాల్‌ హత్యకేసులో ఏసీపీ పురుషోత్తంరెడ్డి బుధవారం కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వనస్థలిపురంలో ఫిబ్రవరి 24 మిస్సింగ్ ఫిర్యాదు వచ్చిందన్నారు. ఫిబ్రవరి 18న కేసు నమోదు అయిందని, పూర్తి స్థాయిలో విచారాణ చేశామని తెలిపారు. విచారణలో  నౌసిన్‌ బేగం గగన్‌ను హత్య చేసినట్లు ఒప్పుకుందని తెలిపారు. రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ టీంతో మృతదేహాన్ని బయటకు తీస్తున్నామని తెలిపారు. కత్తితో గొంతు, ముఖంపై విచక్షణా రహితంగా దాడి చేసిందని ఆయన పేర్కొన్నారు. దీంతో గగన్ అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. 

హత్యలో మరికొందరు పాలుపంచుకున్నట్లు అనుమానం ఉందని ఆయన తెలిపారు. పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించడంతోనే హత్య జరిగి ఉండొచ్చని తెలిపారు. ఈ ఘటనపై ఆకాష్ అగర్వాల్ ఫిర్యాదు చేశారని, హత్య జరిగిన ఇంట్లో గగన్‌తో పాటు నౌసిన్ ఉండేవారని తెలిపారు. సునీల్ అనే వ్యక్తికి హత్యలో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని ఆ దిశలో విచారణ చేస్తున్నామని ఏసీపీ అన్నారు.

హత్యకు గురైన గగన్ అగర్వాల్ సోదరుడు ఆయుష్ మిట్టల్ మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు గగన్ అగర్వాల్ హత్యను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. నౌసిన్ బేగాన్ని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలన్నారు. అసలు ఏరోజు నౌసిన్ బేగం పిల్లలు ఇంటికి వచ్చేవారు కాదని, ఇంటికే రానప్పుడు అసభ్యకరంగా నా సోదరుడు ఎలా ప్రవర్తిస్తాడని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో విచారణ చేయాలని, మొదటి నుంచి నౌసిన్ బేగంపై మాకు అనుమానం ఉందని తెలిపారు. నౌసిన్ బేగం ఇతర రాష్ట్రాలకు ఎందుకు పరారైందని ప్రశ్నించారు. 

గగన్‌ అగర్వాల్‌ హత్య కేసును‌ తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మరెడ్డి అన్నారు.  పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. హత్యలో నౌసిన్‌కు సహకరించిన వ్యక్తులను గుర్తించాలన్నారు.

చదవండి:   భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top