దారుణం: భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య

Missing Man Found Deceased In His Home Vanasthalipuram Hyderabad - Sakshi

ఇంట్లోని కుళాయి గుంతలో మృతదేహాన్ని పూడ్చిన మహిళ 

ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు 

అనుమానంతో విచారిస్తే తానే హత్యచేసినట్టు అంగీకారం 

హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌లో ఘటన 

సాక్షి, హస్తినాపురం: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఏదో చిన్నగొడవ అయితే ఆవేశం పట్టలేకపోయింది.. భర్తను కత్తితో పొడిచి చంపేసింది.. ఇంట్లోనే కుళాయి కోసం తీసిన గుంతలో పెట్టి పూడ్చేసింది. ఏమీ తెలియనట్టుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో గట్టిగా ప్రశ్నించడంతో తానే చంపేసినట్టు ఒప్పేసుకుంది. హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌ పరిధి వివేకానందనగర్‌ కాలనీ ఫేజ్‌–2లో ఈ ఘటన జరిగింది. ఆ మహిళను అరెస్టు చేసిన వనస్థలిపురం పోలీసులు మొత్తం వివరాలను బుధవారం వెల్లడించారు. 

హైదరాబాద్‌లోని పాతబస్తీ యాకుత్‌పురాకు చెందిన నౌసిన్‌ బేగం అలియాస్‌ మరియాద అగర్వాల్‌ (32)కు గతంలోనే పెళ్లయి నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భర్తతో గొడవలు కావడంతో విడాకులు ఇచ్చి వేరుగా ఉంటోంది. మరోవైపు గగన్‌ అగర్వాల్‌ (38) అనే వ్యక్తి కూడా అప్పటికే పెళ్లయి భార్యకు విడాకులు ఇచ్చాడు. అతను యాకుత్‌పురాలో నివాసం ఉంటున్న క్రమంలో నౌసిన్‌తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. వారు గత ఏడాది జూన్‌లో మతాంతర వివాహం చేసుకుని వివేకానందనగర్‌ కాలనీలోని గగన్‌ అగర్వాల్‌ సొంతింటిలో కాపురం పెట్టారు. ఎనిమిది నెలలుగా బాగానే ఉన్నారు. అయితే గత నెల 8న గగన్, నౌసిన్‌ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. నౌసిన్‌ ఆగ్రహంతో కత్తి తీసుకొచ్చి గగన్‌ గొంతులో పొడవడంతో కిందపడిపోయాడు. అప్పటికీ విచక్షణారహితంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

అయితే నౌసిన్‌ ఈ విషయం బయటపడకుండా ఇంట్లోనే కుళాయి కోసం తీసిన గుంతలో గగన్‌ మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. మరుసటి రోజు గగన్‌ సోదరుడు ఆకాశ్‌ అగర్వాల్‌ అక్కడికి వచ్చాడు. గగన్‌ ముందురోజే ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాలేదని నౌసిన్‌ చెప్పింది. తర్వాత ఇద్దరూ కలిసి గగన్‌ అదృశ్యమైనట్టు గత నెల 9న ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు ఘటన జరిగింది తమ పరిధికాకపోవడంతో వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. అక్కడ గత నెల 24న కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. మన్సూరాబాద్‌లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. చివరికి అనుమానంతో నౌసిన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తు సందర్భంగా తానే గగన్‌ను హత్యచేసినట్టు నౌసిన్‌ ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ హత్యలో ఆకాశ్‌ అగర్వాల్‌ పాత్ర ఏమైనా ఉందా, మరెవరికైనా సంబంధం ఉందా అన్న కోణంçలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

చదవండి: పంజాగుట్ట: ఇంట్లో చొరబడి యువతిపై అత్యాచారం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top