సినిమా తరహా పక్కా స్కెచ్‌: అనాథగా అవతారమెత్తి..

Fraud In The Name Of Jobs In Kurnool - Sakshi

ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.18 లక్షలతో ఉడాయింపు

మధ్యవర్తి ఇంటి ఎదుట బాధితుల వంటావార్పు 

మద్దికెర (కర్నూలు): వీడు సామాన్యుడు కాదు.. ఎక్కడ ట్రైనింగ్‌ పొందాడో కాని మోసగించడంలో పట్టా పొందినట్లు కనిపిస్తున్నాడు. సినిమా తరహాలో పక్కా స్కెచ్‌ వేశాడు. అనాథగా అవతారమెత్తాడు. తనకు పెద్దోళ్లతో సంబంధాలు ఉన్నాయని నమ్మించాడు. ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తానని స్థానికులను బురిడీ కొట్టించి రూ.లక్షలతో ఉడాయించాడు. బాధితులు అతని ఆచూకీ గురించి ఆరా తీయగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు వాడే స్కూటీ తమిళనాడు రిజిస్టేషన్, సిమ్‌ కార్డు కర్ణాటక, ఆధార్‌కార్డు విశాఖపట్నం, బ్యాంకు ఖాతా శ్రీకాకుళం చిరునామా ఉండటంతో బాధితులు తలలు పట్టుకున్నారు.

ఈ ఘటన మండల కేంద్రమైన మద్దికెరలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. ఆరు నెలల క్రితం స్థానిక శివజ్యోతి వృద్ధాశ్రమానికి వెంకటతిప్పారెడ్డి అనే వ్యక్తి వచ్చాడు. తనది విశాఖపట్నం అని, తనకు ఎవరూ లేరని ఆశ్రయం పొందాడు. ఈ క్రమంలో స్థానికుడైన ఓ వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. తనకు పెద్దపెద్ద నాయకులు, అధికారులు తెలుసునని, ఎవరైనా ఉంటే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో మధ్యవర్తి స్థానికులకు తెలిపాడు.

ఉద్యోగాలు వస్తే పిల్లల  భవిష్యత్‌ బాగుంటుందనే ఉద్దేశంతో ఇద్దరు వ్యక్తులు రూ.8 లక్షల చొప్పున రూ.16 లక్షలు మధ్యవర్తికిచ్చారు. ఆ డబ్బు తీసుకున్న  వెంకట తిప్పారెడ్డి వారం రోజుల క్రితం మదనపల్లిలో తమ బంధువులు చనిపోయారని వెళ్లి తిరిగి రాలేదు. అతని సెల్‌ నంబర్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉంది. దీంతో మధ్యవర్తిని నిలదీయగా తాను కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పడంతో అందరూ మోసపోయినట్లు గుర్తించారు. అయితే బాధితులు తమ డబ్బులు ఇవ్వాలంటూ మధ్యవర్తి ఇంటి ముందు వంటావార్పు చేపట్టారు. అలాగే న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
చదవండి:
కూన తీరు మారదు.. పరుగు ఆగదు!   
నన్ను క్షమించు బుజ్జి తల్లి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Author:
కె. రామచంద్రమూర్తి
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top