ప్రశ్నపత్రం.. పచ్చ కుట్ర

Exam Paper Leak Conspiracy By The TDP Discredit YSRCP - Sakshi

అనంతపురం విద్య/ సిటీ/ కదిరి: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి అందరి మన్ననలు పొందుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ అంటూ పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లాలో పదో తరగతి ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో షేర్‌ చేసిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఇదంతా కుట్ర అని పోలీసులు సాక్ష్యాధారాలతో సహా తేల్చారు. ప్రశ్నపత్రం ఫొటో తీసి తన సన్నిహితుడికి పంపించిన నల్లచెరువు జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం కె.విజయకుమార్‌ను అరెస్టు చేసి..రిమాండ్‌కు పంపించారు. ఈయన కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ కందికుంట ప్రసాద్‌ ప్రధాన అనుచరుడు. దీన్నిబట్టి చూస్తే పచ్చ నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది.  

స్వయంగా ఫొటో తీసిన విజయ్‌కుమార్‌
2006లో రివాల్వర్‌ కేసులో అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు టీడీపీ నేత కందికుంట ప్రసాద్‌తో పాటు విజయ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ కేసులో వీరు నెల రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు. అప్పుడు సస్పెండ్‌ అయిన విజయ్‌కుమార్‌ రెండేళ్ల తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం నల్లచెరువు జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎంగా ఉండగా.. పదోతరగతి పరీక్షల నేపథ్యంలో గాండ్లపెంట జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌గా అధికారులు నియమించారు. ఈ క్రమంలోనే విజయ్‌కుమార్‌ ప్రశ్నపత్రం ఫొటో తీసి.. తనకు బాగా సన్నిహితుడైన నల్లచెరువు ఎంపీడీఓ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరావు ద్వారా వాట్సాప్‌ గ్రూపులలో షేర్‌ చేయించారు.

శ్రీనివాసరావు బంధువుల అమ్మాయి పదో తరగతి పరీక్ష రాస్తుండగా.. ఆమెకు సహకరించే కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసరావు మొబైల్‌ను పరీక్ష కేంద్రంలోకి పంపించారు. స్వయంగా విజయ్‌కుమారే ప్రశ్నపత్రం ఫొటో తీసి పంపించారు. ఇదే అదనుగా భావించిన శ్రీనివాసరావు పరీక్ష ప్రారంభమైన తర్వాత దాన్ని ఓడీచెరువు వైఎస్సార్‌సీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశారు. ఆ విషయాన్ని వారే మీడియాకు  చేరవేసి... వైఎస్సార్‌సీపీ నాయకులే ఇదంతా చేశారనే విధంగా దుష్ప్రచారం మొదలుపెట్టారు. ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే కుట్రలో భాగంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది.  

పరీక్ష ప్రారంభమయ్యాక ప్రశ్నపత్రం ప్రత్యక్షం
తొలిసారిగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు అత్యంత పకడ్బందీగా జరుగుతున్నాయి. ప్రశ్న పత్రాలను ఇప్పటికే పరీక్ష కేంద్రానికి దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష సమయానికి గంట ముందు అంటే ఉదయం 8:30 గంటలకు ఎగ్జామ్‌ సెంటర్‌ చీఫ్‌ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ కలిసి ప్రశ్నపత్రాలను స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ నుంచి విత్‌డ్రా చేసుకుంటారు. 9 గంటలకు పరీక్ష కేంద్రానికి తీసుకెళతారు. అక్కడ ఇద్దరు ఇన్విజిలేటర్ల సమక్షంలో ఉదయం 9:15 గంటలకు సీల్‌ తీస్తారు.

9:25 గంటలకు గదుల్లోకి పంపుతారు. 9:30 గంటలకు విద్యార్థుల చేతికి అందిస్తారు. అయితే విజయ్‌కుమార్‌ ప్రశ్నపత్రం ఫొటో తీయగా..దాన్ని శ్రీనివాసరావు పరీక్ష ప్రారంభమయ్యాక వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశారు. ఆ తర్వాత ప్రశ్నపత్రం లీక్‌ అంటూ దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్నపత్రం వాట్సాప్‌ ద్వారా వెళ్లినా... విద్యార్థులందరూ పరీక్ష కేంద్రంలోనే ఉంటారు కాబట్టి వారికి ముందే తెలిసే అవకాశం ఉండదు. కేవలం రాజకీయ కుట్రకోణంలో భాగంగా, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేసినట్లు పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.  

హెచ్‌ఎం, జూనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌
పదో తరగతి ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి పంపిన వ్యవహారంలో హెచ్‌ఎం కె.విజయ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ విద్యాశాఖ ఆర్జేడీ  వెంకట కృష్ణా రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేసిన జూనియర్‌ అసిస్టెంట్‌ బి.శ్రీనివాసరావు అలియాస్‌ అమడగూరు స్వామిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా పరిషత్‌  సీఈఓ భాస్కర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. మరోవైపు ఈ ఘటనలో సూత్రధారులతో పాటు పాత్రధారులపైనా పోలీసు దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరికీ కదిరి టీడీపీ నాయకులతో సత్సంబంధాలు ఉండడంతో వారి పాత్రపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.   

తొలి నుంచీ వివాదాస్పదమే
ఆంగ్ల ప్రశ్నపత్రం వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేసిన ఉదంతంలో సస్పెండైన నల్లచెరువు మండల పరిషత్‌ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ బి.శ్రీనివాసరావు అలియాస్‌ అమడగూరు స్వామి వ్యవహారం తొలి నుంచీ వివాదాస్పదమే. అమడగూరు ఉన్నత పాఠశాలలో పని చేస్తూ జూనియర్‌ అసిస్టెంట్‌గా ఇటీవలే పదోన్నతి పొందిన శ్రీనివాసరావును నల్లచెరువు మండల పరిషత్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. అయితే అక్కడ చేరడం ఇష్టం లేని అతను తన పలుకుబడి ఉపయోగించి మళ్లీ అమడగూరు హైస్కూల్‌కు డిప్యుటేషన్‌ వేయించుకున్నాడు. అతని వ్యవహారం నచ్చని అక్కడి హెడ్మాస్టర్‌... శ్రీనివాసరావును జాయిన్‌ చేసుకునేందుకు అంగీకరించలేదు. దీంతో విధిలేక తిరిగి నల్లచెరువు మండల పరిషత్‌ కార్యాలయంలో చేరిపోయాడు. ఈ క్రమంలో కదిరి ప్రాంతంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల వారితో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు.

వారు విద్యాశాఖ కార్యాలయాల్లో తమ పనుల కోసం స్వామిని ఆశ్రయించేవారు. కమీషన్లు తీసుకొని కావాల్సిన పనులను స్వామి చక్కబెట్టేవాడని తెలుస్తోంది. విద్యా శాఖతో పాటు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో పని చేసే అటెండర్లు, రికార్డ్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లు వేయిస్తానంటూ భారీగా వసూలు చేసేవాడని జెడ్పీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆంగ్ల ప్రశ్నపత్రం వాట్సాప్‌ గ్రూపుల్లో పంపిన శ్రీనివాసరావు.. శుక్రవారం విధులకు గైర్హాజరైనట్లు జెడ్పీ అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఎంపీడీఓను అడగ్గా.. సెలవు చీటి పెట్టకపోగా, కనీసం అనుమతి కూడా తీసుకోకుండానే గైర్హాజరైనట్లు సమాధానం చెప్పారు. శ్రీనివాసరావు వ్యవహారాలపై లోతుగా విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బయటకొచ్చే అవకాశం ఉంది.

(చదవండి: మృత్యువులోనూ వీడని బంధం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top