‘సావధాన్​ ఇండియా’ క్రైమ్​ షో చూసి దొంగతనం.. చివరకు

Delhi: Young Boy Arrested For Robbery Says Was Inspired By Crime Show - Sakshi

న్యూఢిల్లీ: సాధారణంగా టీవీలలో, సీరియల్స్​లలో కల్పిత పాత్రలతో క్రైమ్​ వార్తలను ప్రసారం చేస్తుంటారు. దొంగతనాలు, కిడ్నాప్​లు ఆయా ఘటనలకు సంబంధించి కల్పిత పాత్రలను.. ప్రేక్షకుల కంటికి కట్టినట్లు చూపించడానికి టీవీలలో అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాల వలన నేరం చేస్తే.. పడే శిక్షలను పరోక్షంగా చూపిస్తుంటారు.

కొందరు వీటిని చూసి తమ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకుంటే.. మరికొందరు కేటుగాళ్లు మాత్రం టీవీలలో చూపించే కల్పిత దృశ్యాలను అనుసరించి  అడ్డంగా బుక్కైపోతారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మొహమ్మద్​ ఫహీముద్దీన్​ అనే వ్యక్తి లాహోరి గేట్​ అనే ప్రాంతంలో ఉంటున్నాడు. ఇతను జనవరి 18న వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్లాడు.

ఆ తర్వాత రాత్రికి ఇంటికి చేరుకుని చూసేసరికి ఇంటి మెయిన్ గేట్​ తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని వస్తువులు చిందర వందరగా పడేసి ఉండటాన్ని గమనించాడు. వెంటనే షాక్​కు గురైన ఫహీముద్దీన్​.. అదే రోజు​ ​తన ఇంట్లో డబ్బు, బంగారం పోయినట్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆ ప్రాంతాలలోని దాదాపు 200ల సీసీ కెమెరాలను పరిశీలించారు.

చివరకు నిందితుడిని కాట్రా హిందు ప్రాంతంలో కనుగొన్నారు. నిందితుడిని ఫయాజ్​గాను.. అతడికి 20 ఏళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఇంట్లో నుంచి దాదాపు 2,15,000 డబ్బు స్వాధీనం చేసుకున్నారు. రెండు బంగారు గొలుసులు, ఒక రింగ్​, మొబైల్​ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు.

స్థానిక టీవీ క్రైమ్ షో ‘సావధాన్​ ఇండియా’ స్ఫూర్తితో చోరీకి పాల్పడినట్లు తెలిపాడు. ఆ షోలో చోరీచూసి ఎలా తప్పించుకోవచ్చో చూశానని .. అలానే చేశానని తెలిపాడు. తాను.. నెలకు 8వేలను సంపాదిస్తున్నానని.. అది చాలకే చోరీల బాట ఎంచుకున్నట్లు  వివరించాడు. వచ్చే ఫిబ్రవరి 14న తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా తెలిపాడు. అతగాడి సమాధానాలు విని పోలీసులు ఒకింత  ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

చదవండి: ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్​ ఏంటంటే

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top