లిక్కర్‌ స్కామ్‌లో అభిషేక్‌రావు అరెస్టు

Delhi Liquor Scam: Abhishek Rao Arrested In Liquor Scam - Sakshi

ఢిల్లీ కోర్టులో హాజరు.. మూడు రోజుల కస్టడీకి తీసుకున్న సీబీఐ 

స్కామ్‌కు సంబంధించి అభిషేక్‌రావు ఖాతాల్లోకి రూ.3.85 కోట్లు బదిలీ 

ఆ నగదు, బదిలీలకు సరైన పత్రాలు చూపించలేదంటున్న అధికారులు 

ఈ కేసులో ఇప్పటికే విజయ్‌ నాయర్‌ అరెస్టు 

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నిందితుల్లో పెరుగుతున్న ఆందోళన 

ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయి, ఎవరిపై దాడి జరుగుతుందనే ఉత్కంఠ 

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం దర్యాప్తులో సీబీ­ఐ దూకుడు పెంచింది. నిన్నమొన్నటి వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వరుస దాడులు, విచారణ, కీలక ప­త్రాల సేకరణతో కలకలం చెలరేగగా.. ఆదివారం అర్ధరాత్రి సీబీఐ అధికారులు నిందితుల్లో ఒకరైన బోయినపల్లి అభిషేక్‌రావును అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులకు అభిషేక్‌రావు దగ్గరి వ్యక్తిగా పేరుంది. అనూస్‌ బ్యూటీ పార్లర్‌ యజమాని అయి­న అభిషేక్‌రావు, దానితోపాటు తొమ్మిది కంపెనీల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కీలకమైన వ్యక్తు­ల్లో అభిషేక్‌రావు ఒకరని సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. 

మూడు రోజుల కస్టడీకి.. 
అభిషేక్‌రావును సోమవారం ఉదయం ఢిల్లీ కోర్టు ఎదుట ప్రవే­శపెట్టినసీబీఐ అధికారులు.. కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ విచారణలో అభిషేక్‌రావు ఎవరెవరి పేర్లను బయటపెడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. తదుపరి చర్యలు ఎవరిపై అన్న ఆందోళన నిందితుల్లో వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. లిక్కర్‌ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించిన రాబిన్‌ డిస్టిలరీస్‌కు చెందిన రామచంద్రన్‌ పిళ్లైతో కలిసి అభిషేక్‌రావు వ్యాపారం చేస్తున్నారు. మొత్తంగా ఈ కుంభకోణంలో లింకులన్నీ హైదరాబాద్‌ కేంద్రంగా ఉండడంతో ఎప్పుడు, ఎవరిపై వేటు పడుతుందోనని ఈ స్కామ్‌తో సంబంధమున్నట్టు ప్రచారం జరుగుతున్న ముఖ్యులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. 

నగదు పంపిన లెక్కలేవి? 
లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి రూ.3.85 కోట్లు అభిషేక్‌రావు ఖాతాలో చేరినట్టు సీబీఐ అధికారులు చెప్తున్నారు. ఇండో స్పిరిట్‌ లిక్కర్‌ కంపెనీ ఖాతాల నుండి ఈ నగదు ఆయనకు బదిలీ అయిందని గుర్తించారు. ఇండో స్పిరిట్‌ డైరెక్టర్‌ సమీర్‌ మహేంద్రను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. మరో నిందితుడు విజయ్‌ నాయర్‌తో సంబంధాలపై సీబీఐ ఆరా తీసింది.

అయితే ఈ నగదు బదిలీకి సంబంధించి అభిషేక్‌రావు సరైన పత్రాలు చూపించలేదని సీబీఐ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ తయారీ సమయంలో అభిషేక్‌రావు అధికారులతో వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నట్టు తేలిందని అంటున్నాయి. అభిషేక్‌రావు వ్యాపార భాగస్వాములుగా ఉన్న తొమ్మిది కంపెనీల్లోని వ్యక్తులను కూడా త్వరలో విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

ఆ తొమ్మిది కంపెనీల్లోనూ.. 
బోయినపల్లి అభిషేక్‌రావు తొమ్మిది కంపెనీల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అనూస్‌ ఒబేసిటీ అండ్‌ ఎలక్ట్రోలిసిస్, రాబిన్‌ డిస్టిలరీస్, అగస్టీ వెంచర్స్, ఎస్‌ఎస్‌ మైన్స్‌ అండ్‌ మినరల్స్, నియోవర్స్‌ రియాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్, వాల్యూ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, జీనస్‌ నెట్‌వర్కింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, అనూస్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కంపెనీలలో అభిషేక్‌రావు డైరెక్టర్‌గా ఉన్నారు.

లిక్కర్‌ స్కాంలో కీలకపాత్ర పోషించిన సమీర్‌ మహేంద్ర, విజయ్‌నాయర్‌లు ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్‌లో లిక్కర్‌ స్కాం డొంక కదులుతున్నట్టు సీబీఐ, ఈడీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఈడీ, సీబీఐ అధికారులు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబు, వెన్నమనేని శ్రీనివాసరావు, గండ్ర ప్రేమ్‌సాగర్‌రావు, అభినయ్‌రెడ్డిలను విచారించిన విషయం తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top