వాట్సాప్‌ చాట్‌ హ్యాక్‌.. ఆరా తీస్తున్న పోలీసులు

Cyber Crime Whatsapp Chats Hacked By Seeking Help Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఎమర్జెన్సీ మెసేజ్‌ల పేరుతో పలువురికి వాట్సాప్‌లో సందేశాలు పంపించి బురిడీ కొట్టించారు. ఆయా వ్యక్తుల వాట్సాప్‌ చాట్‌ను హ్యాక్‌ చేసి వ్యక్తిగత గోప్యతకు సవాల్‌ విసిరారు. బాధితుల్లో సెలబ్రిటీలు, డాక్టర్లు ఉండటం గమనార్హం. వివరాలు.. పలువురు ప్రముఖులను టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు.. వారి కాంటాక్ట్‌లో ఉన్న నంబర్ల నుంచి మెసేజ్‌లు పంపించారు. ‘‘ఎమర్జెన్సీ హెల్ప్‌’’ అంటూ ఆరు డిజిట్ల కోడ్‌తో ఎస్‌ఎంఎస్‌లు పంపించారు. ఓటీపీ నెంబర్‌ పంపాలంటూ రిక్వెస్ట్‌ చేశారు. తెలిసిన వాళ్ల నంబర్ నుంచే మెసెజ్ రావడంతో బాధితులు రిప్లై ఇచ్చారు. (చదవండి: కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌బీఐ)

దీంతో సదరు వ్యక్తుల నంబర్‌ హ్యాక్‌ చేసి, బాధితుల నంబర్ నుంచి ఇంకొకరికి రిక్వెస్ట్‌ పంపించారు. ఇదే హ్యాకర్ల మోడస్‌ ఆపరాండి. ఇలా చాలా మందిని టార్గెట్‌ చేసి.. ‘‘ఎమర్జెన్సీ హెల్ప్’’ అంటూ వాట్సాప్‌ చాట్‌లను హ్యాక్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వాట్సాప్‌ హ్యాక్‌పై ఆరా తీస్తున్నారు. వాట్సాప్‌లో వచ్చే కోడ్‌ మెసేజ్‌లను.. ఎవరికీ పంపొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కోడ్‌ పంపితే వ్యక్తిగత సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఇక సైబర్‌ భద్రతా నిపుణులు సైతం.. ఎట్టి పరిస్థితుల్లో కోడ్‌ చెప్పొందని, హ్యాకర్లతో ప్రమాదం పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top