ఆ విషయంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌బీఐ

SBI Warns Account Holders On Fake Whatsapp Calls - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్‌నెట్‌ వినియోగం విపరీతంగా పెరుగుతుండటంతో అదే రీతిలో సైబర్ నేరాలు కూడా అధికమయిపోతున్నాయి.  ఈ నేపథ్యంలోనే వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారంటూ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరోమారు తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. ఇప్పటికే మెయిల్స్‌ ద్వారా తమ వినియోగదారులను టార్గెట్‌ చేస్తున్నారని వెల్లడించిన ఎస్‌బీఐ తాజాగా వాట్సాప్‌ ద్వారా కూడా కస్టమర్లకు వల వేస్తున్నారని పేర్కొంది. లాటరీ గెలుచుకున్నారంటూ వాట్సాప్ కాల్స్ చేస్తారని, మోసపూరితమైన సందేశాలు పంపుతారని తెలిపింది. అనంతరం ఫలానా ఎస్బీఐ నెంబర్ ను సంప్రదించాలంటూ నమ్మబలుకుతారని, ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తన కస్టమర్లను హెచ్చరించింది.

ఎస్‌బీఐ ఈమెయిల్, ఎస్సెమ్మెస్, ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ ద్వారా ఎప్పుడూ ఖాతాదార్ల వ్యక్తిగత వివరాలు అడగదని బ్యాంక్‌ అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు, లక్కీ కస్టమర్ గిఫ్టులు, లాటరీ స్కీములను తాము ఎక్కడా అమలు చేయడంలేదని, ఇలాంటి ప్రలోభాల్లో చిక్కుకునేముందు ఓసారి ఆలోచించాలని ఒక ప్రకటన ద్వారా తెలిపింది.  ఖాతాదార్లు ఎప్పుడు తప్పు చేస్తారా అని సైబర్ నేరగాళ్లు కాచుకుని ఉంటారని ఇలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తన సందేశాన్ని కస్టమర్లకు తెలిపింది. బ్యాంక్‌ లోపం కారణంగా వినియోగ దారుల డబ్బుపోతే బ్యాంక్‌ చెల్లిస్తుంది కానీ ఇలా వినియోదారుల నిర్లక్ష్యం కారణంగా పోతే బ్యాంక్‌కు సంబంధం ఉండదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.  

చదవండి: లోన్‌ కస్టమర్లకు ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top