లైంగికంగా వేధిస్తున్నాడని మామను కొట్టి చంపిన కోడలు

Crime News: Daughter In Law Killed Father In Law In Wanaparthy District - Sakshi

సహకరించిన తమ్ముడు.. వనపర్తి జిల్లాలో ఘటన 

ఆస్తిని కాజేయాలనే కుట్రతోనే చంపారని బంధువుల ఆరోపణ  

గోపాల్‌పేట: లైంగికంగా వేధిస్తున్నాడంటూ మామను ఓ కోడలు కొట్టి చంపింది. దీనికి ఆమె తమ్ముడు సహకరించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలను ఇన్‌చార్జ్‌ ఎస్పీ రంజన్‌రతన్‌ కుమార్‌ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. గోపాల్‌పేట మండలంలోని చెన్నూరుగ్రామానికి చెందిన నెంబర్‌ రాములు(50), కొండమ్మ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు.

కూతురికి గతంలోనే పెళ్లి కాగా హైదరాబాద్‌లో ఉంటోంది. కొడుకు ప్రశాంత్‌ నాలుగు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన చంద్రకళను కులాంతర వివాహం చేసుకున్నాడు. ప్రశాంత్‌ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లి ఇటీవల స్వగ్రామానికి వచ్చారు. ప్రశాంత్‌ మానసికస్థితి సరిగాలేదు. ఈ క్రమంలో కొంతకాలంగా కోడలిని మామ లైంగికంగా వేధించసాగాడు.

ఈ విషయమై వీడియో రికార్డు కూడా చేసింది. హైదరాబాద్‌లో ఉంటున్న తన తమ్ముడు శివకు విషయం చెప్పింది. సోమవారం మధ్యాహ్నం మామను పొలం వద్దకు పిలిపించి శివ, చంద్రకళ కలసి తీవ్రంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని రాములును స్థానిక పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయించారు. అనంతరం కుమారుడికి సమాచారం అందించారు. అయితే రాములు పరిస్థితి విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై మృతుడి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మంగళవారం ఉదయం గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌ జరిగిందనే ప్రచారం జరిగింది. దీనిపై తప్పుడు ప్రచారం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.  

ఆస్తిని కాజేయాలనే ఇలా చేశారు 
నెంబర్‌ రాములు కొడుకుతోపాటు భార్యకు మతిస్థిమితం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. వీరి ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో పథకం ప్రకారమే ప్రశాంత్‌ని చంద్రకళ కులాంతర వివాహం చేసుకుందని బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే మామ వేధిస్తున్నాడని చిత్రీకరించారన్నారు. మంగళవారం కోడలి తల్లి అంజనమ్మ, సోదరి శశికళ ఇళ్లపై నెంబర్‌ రాములు బంధువులు, గ్రామస్తులు దాడిచేసి ఒకవైపు కూల్చేసి వారిని చితకబాదారు.

అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని గ్రామపంచాయతీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచారు. అనంతరం ఏఎస్పీ షాకీర్‌ హుస్సేన్, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. పోలీసుల సహకారంతో వారిని అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top