ఢిల్లీ టు చైనా.. వయా కెనడా

City Cyber Crime Police Arrest Yehu At Delhi Airport - Sakshi

పారిపోయేందుకు పథకం వేసిన యేహూ 

కలర్‌ ప్రిడిక్షన్‌ ఖాతాల స్తంభనతో అలర్ట్‌ 

ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడిన వైనం

సాక్షి, హైదరాబాద్‌: ఈ–కామర్స్‌ ముసుగులో భారీ బెట్టింగ్‌ గేమింగ్‌కు పాల్పడిన కలర్‌ ప్రిడిక్షన్‌ కేసులో కీలక నిందితుడిగా ఉన్న యేహూ అనే చైనీయుడిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. మరో కీలక నిందితుడు హేమంత్‌ కోసం గాలిస్తున్నారు. చైనాకు చెందిన బీజింగ్‌ టీ పవర్‌ సంస్థ ఈ కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌ వెనుక ఉంది. దీనికి అనుబంధంగా ఢిల్లీలోని గుర్గావ్‌లో ఓ కార్యాలయం పని చేస్తోంది. చైనాకు చెందిన యే హూను తమ సంస్థ సౌత్‌ ఈస్ట్‌ ఏషియా ఆపరేషన్స్‌ హెడ్‌గా బీజింగ్‌ టీ పవర్‌ సంస్థ నియమించింది. ఇతడు ఈ ఏడాది జనవరిలో ఢిల్లీకి చేరుకున్నాడు.

ఈ–కామర్స్‌ సంస్థల పేరుతో అప్పటికే ఢిల్లీలోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో నమోదై ఉన్న గ్రోవింగ్‌ ఇన్ఫోటెక్‌ ప్రెవేట్‌ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ ప్రెవేట్‌ లిమిటెడ్, పాన్‌ యన్‌ టెక్నాలజీస్‌ సర్వీస్, లింక్‌యన్‌ టెక్నాలజీ ప్రెవేట్‌ లిమిటెడ్, డాకీపే ప్రెవేట్‌ లిమిటెడ్, స్పాట్‌పే ప్రెవేట్‌ లిమిటెడ్, డైసీలింగ్‌ ఫైనాన్షియల్‌ ప్రెవేట్‌ లిమిటెడ్, హువాహు ఫైనాన్షియల్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌ల కార్యకలాపాలు ఇతడు పర్యవేక్షిస్తున్నాడు. ఢిల్లీవాసులు హేమంత్, ధీరజ్‌ సర్కార్, అంకిత్‌ కపూర్, నీరజ్‌ తులేలను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు.  

బాధితుల ఫిర్యాదుతో..: కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌ వలలో చిక్కి నష్టపోయిన ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఇటీవల కేసులు నమోదయ్యాయి. ప్రాథమికంగా దర్యాప్తు అధికారులు పేమెంట్‌ గేట్‌వేస్‌పై దృష్టి పెట్టారు. పేటీఎం, గూగుల్‌ పేల ద్వారా జరిగిన లావాదేవీలను విశ్లేషించారు. బెట్టింగ్‌కు సంబంధించిన నగదు తొలుత డాకీ పే సంస్థకు, అక్కడ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలోకి వెళ్ళినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. దీంతో ఆ బ్యాంక్‌కు లేఖ రాసిన దర్యాప్తు అధికారులు రూ.30 కోట్ల బ్యాలెన్స్‌ ఉన్న రెండు ఖాతాలను ఫ్రీజ్‌ చేయించారు. తమ కార్యకలాపాలపై పోలీసుల కన్ను పడిందని తెలుసుకున్న అతడు తక్షణం తమ దేశానికి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. 

కెనడా విమానం ఎక్కే ప్రయత్నాల్లో... 
కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ నుంచి చైనాకు విమాన సర్వీసులు నడవట్లేదు. దీంతో కెనడాకు టికెట్‌ బుక్‌ చేసుకున్న యేహూ అక్కడ నుంచి చైనా వెళ్లాలని పథకం వేశాడు. కెనడా విమానం ఎక్కే ప్రయత్నాల్లో ఉండగా ఢిల్లీ విమానా శ్రయంలో సిటీ సైబర్‌ క్రైమ్‌ బృందానికి చిక్కాడు. మరోపక్క ఈ కలర్‌ ప్రిడిక్షన్‌ నిర్వాహక సంస్థ బీజింగ్‌ టీ పవర్‌ సంస్థ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి యేహూను తమ కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఏడున్నర నెల్లోనే రూ.1,100 కోట్లు టర్నోవర్‌ చేయడంతో పాటు రూ.110 కోట్లను విదేశాలకు తరలించిన నేపథ్యంలో మనీలాండరింగ్‌ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ–కామర్స్‌ పేరుతో బెట్టింగ్‌ నిర్వహించిన ఆ ఎనిమిది సంస్థలూ జీఎస్టీ లేదా ఆదాయపుపన్ను చెల్లించలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆయా విభాగాలకు సమాచారం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top