పబ్బు..గబ్బు!

Central Zone Task Force Police Raids On Club In Ramgopalpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌పై నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడితో వీటి కేంద్రంగా సాగుతున్న రేవ్‌ పార్టీలు బహిర్గతమయ్యాయి. తాజాగా రామ్‌గోపాల్‌పేటలోని క్లబ్‌ టెకీలపై సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, జూబ్లీహిల్స్‌లోని ఎనిగ్మా పబ్‌పై స్థానిక  పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేయడంతో వీటి కేంద్రంగా జరుగుతున్న ‘డ్యాన్సుల’ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన నగర పోలీసులు అన్ని క్లబ్బుల పైనా నిఘా ముమ్మరం చేశారు.  

దేశ, విదేశీ యువతులతో క్యాబరేలు... 
పబ్స్‌లో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాల్లో నగరంలోని దిగువ, మధ్యతరగతి, దేశ, విదేశీ యువతులతో చేయించే క్యాబరేలు నయా ట్రెండ్‌గా మారాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి వీటి నిర్వాహకులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు తెర తీస్తున్నారు. వివిధ మెట్రో నగరాలకు చెందిన యువతలతో పాటు టూరిస్టు వీసాలపై విదేశీ యువతుల్ని నగరానికి తెస్తున్న దళారులు పబ్స్, రిసార్ట్స్‌లో వారి ఒంపుసొంపులను ఎరగా వేసి రెండు చేతులా ఆర్జిస్తున్నారు.

పర్యాటకం ముసుగులో సాగుతున్న ఈ వ్యాపారం వ్యవస్థీకృతంగా జరుగుతోంది. ఎప్పుడైనా దాడులు జరిగినపుడు ఆ యువతులే పట్టుబడుతున్నారు తప్ప సూత్రధారులు మాత్రం తప్పించుకుంటున్నారు. గతంలో బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో పట్టపగలే అశ్లీల నృత్యాలుృ చేస్తూ ముగ్గురు రష్యా యువతులు పోలీసులకు దొరికారు. మరో యువతి టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడింది.  

ఆ దేశాల వాళ్లే ఎక్కువ... 
ఈ అనధికారిక క్యాబరేల్లో నర్తించడానికి వస్తున్న విదేశీ యువతుల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, ఇతర వూజీ సోవియట్‌ యూనియన్‌ దేశాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఆయా దేశాల్లోని ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు దళారులు అక్కడి యువతులకు డబ్బు ఎరవేస్తున్నారు. ఆకర్షణీయమైన దేహ సౌష్టవం కలిగిన వారిని టూరిస్టు వీసాలపై ఇక్కడకు రప్పిస్తున్నారు. ఆపై వారికి, వారి నృత్యాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనంతరం వీరితో పబ్‌లు, క్లబ్బుల్లో అశ్లీల ప్రదర్శనలు ఇప్పిస్తూనే కస్టమర్లను విటులుగా మార్చుకుని మరోపక్క వ్యభిచారం చేయిస్తున్నారు. 

గంట గంటకో రేటు... 
విదేశీ యువతుల నృత్యాలు, వారిపై ఉండే క్రేజును లక్ష్యంగా చేసుకునే ఏజెంట్లు వీరిని ఆటబొమ్మల్ని చేసి గంటల చొప్పున రేటు కట్టి మరీ వసూలు చేస్తుంటారు. ఒక్కో సందర్భంలో ఈ క్యాబరేలకు గంటకు రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇందులో యువతులకు దక్కేది మాత్రం తక్కువే. వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ వ్యవహారాలు నడిపే సూత్రధారులు నగరానికి చెందిన వారు కారని తెలుస్తోంది. కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ముంబై కేంద్రంగా ఈ దందా నడుపుతున్నాడని సమాచారం. అక్కడి ఓ ఆంగ్లో ఇండియన్‌ యువతి ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.  

పబ్స్‌పై డేగకన్ను వేశాం  
వరుసగా వెలుగులోకి వస్తున్న ఉదంతాల నేపథ్యంలో నగరంలోని పబ్స్‌పై డేగకన్ను వేశాం. ఇప్పటి వరకు డ్రగ్స్‌ పైనే దృష్టి ఉండేది. ఇకపై ఇలాంటి డ్యాన్సుల విషయాన్నీ, అసాంఘిక కార్యకలాపాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తాం. నిర్ధేశిత సమయానికి మించి నడుస్తున్న పబ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. దీనిపై ఇప్పటికే వాటి నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు ఇచ్చాం. 
– నగర పోలీసు ఉన్నతాధికారి  

(చదవండి: కార్డినల్‌గా పూల ఆంథోనీ)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top