గుంటూరు, నరసరావుపేటల్లో చంద్రబాబుపై కేసులు

Cases against Chandrababu in Guntur and Narasaraopet - Sakshi

న్యాయవాదులు అనిల్‌కుమార్, శ్రీనివాసరావుల ఫిర్యాదు 

సాక్షి, గుంటూరు/నరసరావుపేటటౌన్‌: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై గుంటూరు జిల్లాలో రెండుచోట్ల కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఎన్‌440కె వేరియంట్‌ కోవిడ్‌–19 వైరస్‌ ఉద్భవించి వ్యాప్తి చెందుతోందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గుంటూరుకు చెందిన న్యాయవాది పచ్చల అనిల్‌కుమార్‌ అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లోను, న్యాయవాది రాపోలు శ్రీనివాసరావు నరసరావుపేట టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లోను ఫిర్యాదు చేశారు. అనిల్‌కుమార్‌ ఫిర్యాదుపై క్రైమ్‌ నంబర్‌  230/2021 ఐపీసీ సెక్షన్‌లు 188, 501 (1)బి, 505 (2), విపత్తుల నిర్వహణ చట్టం–2005 సెక్షన్‌ 54 కింద చంద్రబాబు, మరికొందరిపై అరండల్‌పేట సీఐ దాసరి నరేష్‌కుమార్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులపై కేసు నమోదు చేసినట్లు నరసరావుపేట సీఐ కృష్ణయ్య తెలిపారు.

ఎన్‌440కె వేరియంట్‌ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని, ఇది 10–15 రెట్లు ప్రమాదకరమని చంద్రబాబు, టీడీపీ ప్రతినిధులు పత్రికలు, టీవీ చానళ్లలో చేస్తున్న ప్రకటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని న్యాయవాదులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ దుష్ప్రచారం వల్ల ప్రజలు, కోవిడ్‌ రోగులు మానసిక ఒత్తిడికి లోనై మరణాల రేటు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌440కె వేరియంట్‌ వైరస్‌ ప్రమాదకరమైనది కాదని సీసీఎంబీ పేర్కొందని గుర్తుచేశారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు.. వైరస్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్న  ప్రభుత్వ యంత్రాంగం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ల కేటాయింపు అధికారం పూర్తిగా తమ చేతుల్లో ఉందని కేంద్రం చెప్పినా వ్యాక్సినేషన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. శ్మశాన వాటికల్లో పరిస్థితులపై టీడీపీ అనుకూల పత్రికల్లో తప్పుడు కథనాలు ప్రచురితమవుతున్నాయని తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top