చెరువులోకి దూసుకెళ్లిన కారు

Car crashed into pond at Mangalagiri - Sakshi

నలుగురు యువకులు జలసమాధి

మంగళగిరిలో విషాదం

తాడేపల్లి రూరల్‌: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని యర్రబాలెం వద్ద నలుగురు స్నేహితులు ప్రయాణిస్తున్న కారు సోమవారం రాత్రి అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులూ జలసమాధి అయ్యారు. వీరంతా మంగళగిరి ప్రాంతానికి చెందిన వారే. వడ్రంగి పనిచేసే వాకా శ్రీనివాసరావు (34), డాక్యుమెంట్‌ రైటర్‌ తేజ్‌రాంజీ (25), ఇతని అసిస్టెంట్‌ కొల్లూరు సాయి (25), ఏసీ మెకానిక్‌ పవన్‌కుమార్‌ (26) స్నేహితులు.

వీరు కారులో తుళ్లూరు వెళ్లి వస్తుండగా యర్రబాలెం యర్రచెరువు వద్దకు రాగానే కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిపోయింది. కారు అద్దాలు తెరిచి ఉండడంతో నీళ్లు ప్రవేశించి నలుగురు జలసమాధి అయ్యారు. తుళ్లూరు నుంచి వాహనాలపై వస్తున్న వారు ఈ విషయాన్ని గమనించి ఆ మార్గంలో వస్తున్న లారీని ఆపి తాడు సహాయంతో కారును బయటకు తీశారు. 108 సిబ్బంది ఆ నలుగురిని పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. 

ఐదు నిమిషాల్లో ఇంటికి వస్తానంటూ..
రాంజీ తన భార్య మహేశ్వరికి ఫోన్‌చేసి 5 నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పిన కొద్దిసేపటికే వీరంతా విగతజీవులుగా మారారు. భర్త ఎంతసేపటికీ రాకపోవడంతో మహేశ్వరి మరోసారి రాంజీకి ఫోన్‌చేయగా ప్రమాద స్థలి వద్ద ఉన్నవారు ఫోన్‌ ఎత్తి రాంజీ చనిపోయాడని చెప్పడంతో ఆమె కుప్పకూలిపోయినట్లు బంధువులు తెలిపారు. రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన మహేశ్వరిని రాంజీ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ 5 నెలల కుమారుడు ఉన్నాడు. అలాగే, వాకా శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top