లైంగిక దాడికి యత్నించిన జవాన్‌.. 8 ఏళ్ల బాలిక సాహసం

Army Jawan Arrested For Molestation On Minor - Sakshi

లైంగిక దాడికి యత్నించిన జవాన్‌ను ప్రతిఘటించింది

రైలు నుంచి బాలికను కిందకి తోసేసిన జవాను

గాయాలపాలైనా లెక్కచేయక నిందితుడిని పోలీసులకు పట్టించిన వైనం

పుణె: ఎనిమిదేళ్ల ఓ బాలిక అసాధారణ తెగువ ప్రదర్శించింది. లైంగిక దాడికి యత్నించిన ఆర్మీ జవాన్‌(33)ను ప్రతిఘటించింది. కదులుతున్న రైలు నుంచి జవాను కిందికి తోసేయడంతో గాయపడినా వెరవక, నిందితుడిని పోలీసులకు పట్టించింది. గోవా–నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మహారాష్ట్రలోని సతారా జిల్లా లొనంద్‌–సల్పా రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మాజీ సైనికుడి కుమార్తె అయిన ఈ బాలిక, తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి ఢిల్లీ నుంచి వస్తోందని పుణె డివిజన్‌ రైల్వే ఎస్‌పీ సదానంద్‌ పాటిల్‌ తెలిపారు.

‘ప్రభు మలప్ప ఉపహార్‌ అనే ఆర్మీ జవాను కూడా అదే బోగీలో ప్రయాణిస్తున్నాడు. అంతా గాఢ నిద్రలో ఉండగా ఉపహార్‌ ఆ బాలికను టాయిలెట్‌లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాలిక మేల్కొని తీవ్రంగా ప్రతిఘటించడంతోపాటు గట్టిగా కేకలు వేసింది. దీంతో అతడు, తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తానంటూ ఆమెను బయటకు తీసుకువచ్చి, రైలు కిందికి తోసేశాడు. అదృష్టవశాత్తూ, రైలు ఆ సమయంలో తక్కువ వేగంతో వెళ్తుండటంతో పట్టాలపై పడిపోయిన బాలిక స్వల్పంగా గాయాలయ్యాయి.

ఉదయం వేళ సమీప గ్రామస్తులు పట్టాల పక్కన పడి ఉండగా బాలికను గమనించి, ఆస్పత్రిలో వైద్యం చేయించారు. కోలుకున్న బాలిక జరిగిన ఘటనను, ముఖ్యంగా ఆర్మీ జవాను పోలికలను పోలీసులకు వివరించింది. దీంతో, 400 మంది పోలీసులు, రైల్వే కానిస్టేబుళ్లు వేర్వేరు స్టేషన్లలో ఆ రైలులోకి ప్రవేశించి, ఆ రైలు నుంచి ప్రయాణికులెవరూ కిందికి దిగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బాలిక చెప్పిన ప్రకారం పోలికలున్న 30 మందిని వేరుచేసి, అందులో నిందితుడైన ఉపహార్‌ను గుర్తించారు. అతడిని దగ్గర్లోని భుసావల్‌కు తీసుకెళ్లారు’ అని ఆయన వెల్లడించారు. ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పనిచేసే నాయిక్‌ హోదా జవానుగా గుర్తించామన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top