ఏమైందో? ఏమో?..అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

Andhra Pradesh: Mystery Over 22 Year Old Girl Deceased Srungavarapukota - Sakshi

శృంగవరపుకోట(విజయనగరం): ఎస్‌.కోట పట్టణంలోని ఎరుకలిపేటలో నేమాపు వాసవి (22) అనే యువతి మంగళవారం రాత్రి సుమారు 9గంటల సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే తన కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది.  మృతురాలికి తల్లి లక్ష్మీ, సోదరి రోజా ఉన్నారు. ముగ్గురూ కలిసి లక్ష్మి శ్రీ వేంకటేశ్వర థియేటర్‌ ఎదురుగా మెయిన్‌రోడ్డు పక్కన జ్యూస్, పండ్ల దుకాణం నిర్వహిస్తున్నారు.

ఈ సంఘటనపై మృతురాలి అక్క రోజా బుధవారం స్థానిక విలేకరులకు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. ఎస్‌.కోట పట్టణానికి చెందిన నాని అనే వ్యక్తి ఫోన్‌ చేసి తనను పెళ్లి చేసుకోకపోతే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మీ చెల్లి వాసవి బెదిరిస్తోందని, వెంటనే ఇంటికి వెళ్లి ఆమె దగ్గర ఉండాలని చెప్పాడు. దీంతో వెంటనే ఇంటికి వెళ్లి చూడగా వాసవి కింద పడి ఉంది. ఎంత లేపినా చలనం లేవకపోవడంతో స్థానికుల సహకారంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారని చెప్పింది. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీ ప్రసన్నకుమార్‌ చెప్పారు. కాగా మృతురాలు వాసవి రాసినట్లు చెబుతున్న రెండు పేజీల లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు, చేతిరాతను నిర్ధారించే పనిలో ఉన్నట్లు సమాచారం. 

ముమ్మాటికీ హత్యే   
“వాసవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఆమె పిరికిది కాదు. చాలా తెలివైనది. నేను దుకాణం వద్ద ఉండగా మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి వంట చేసింది. ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంటే ఎందుకు వంట చేస్తుంది. వైరు, తాడు, పెద్ద చున్నీ లేకుండా ఫ్యాన్‌కు ఎలా ఉరివేసుకోగలదు? వాసవిని ఎవరో  చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని’ మృతురాలి తల్లి లక్ష్మి ఆరోపించింది. రాత్రి ఇంటి బయట ఒక వ్యక్తి చీకట్లో నిల్చుని ఉండగా వీధి మహిళ ఒకరు చూశారని, మరో వ్యక్తి మేడపైకి వెళ్లి హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తోంది. వాసవి మృతిపై అన్ని కోణాల్లో   దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమవుతోంది.

చదవండి: 8 మంది భర్తలను మోసగించి.. తొమ్మిదో పెళ్లికి రెడీ, ఎయిడ్స్‌ సోకడంతో..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top