ఎరక్కపోయి.. ఇరుక్కున్నారు!

ACB Raids In Chittoor District - Sakshi

అధికారులకు ముచ్చెమటలు పట్టించిన ఫేక్‌ ఏసీబీ

ఇది శ్రీనాథ్‌రెడ్డి గ్యాంగ్‌ పనే అంటున్న పోలీసులు

పట్టుబడిన నకిలీలు ఇచ్చిన సమాచారంతోనే జిల్లాలో ఏసీబీ దాడులు

పలమనేరు(చిత్తూరు): ఏసీబీ అధికారులమంటూ జిల్లాలోని పలు అధికారులను టార్గెట్‌ చేసి వారినుంచి తమ ఖాతాల్లోకి డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్న ముఠా నుంచి రాబట్టిన సమాచారంతోనే జిల్లాలో మంగళవారం ఏసీబీ దాడులు జరిగినట్టు తేటతెల్లమైంది. కర్నూలు జిల్లాలో ఇదే తరహా మోసాలకు పాల్పడుతూ శ్రీనాథ్‌రెడ్డి ముఠా ఈనెల 1న అక్కడి పోలీసులకు పట్టుబడింది. గత జూన్‌ నుంచి నకిలీ ఏసీబీ అధికారులకు, జిల్లాలోని పలువురు అధికారులకు మధ్య సాగిన లావాదేవీలు, ఫోన్‌కాల్‌ సంభాషణలు ఇప్పుడు ఏసీబీకి ‘కీ’లకమైన ఆధారాలయ్యాయి. నకిలీ ఏసీబీ ముఠా పట్టుబడడంతో గుట్టుగా సాగుతున్న అధికారుల బాగోతం బట్టబయలైంది. ఫేక్‌ ఏసీబీకి నగదు ముట్టజెప్పినవారు రాష్ట్రంలో 60మందికిపైగా ఉండగా జిల్లాలో చిత్తూరు ఆర్‌అండ్‌బీ ఈఈ చంద్రశేఖర్‌ రూ.2లక్షలు, ఇరిగేషన్‌ డిప్యూటీ ఎస్‌ఈ కృష్ణమూర్తి రూ.1.5 లక్షలు, పలమనేరు మున్సిపల్‌ కమిషనర్‌ విజయసింహారెడ్డి రూ.3.49 లక్షలు సమర్పించుకున్నట్టు తేలింది. (చదవండి: వదినపై మరిది కర్కశం

అంతా చూసినట్టుగానే..!
పలమనేరు మున్సిపల్‌ కమిషనర్‌ విజయసింహారెడ్డి గత ఏడాది ఎర్రగుంట్ల మున్సిపాలిటీ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈనెలాఖరున ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జూలై మొదటివారంలో ఆయనకు విజయవాడ ఏసీబీ అధికారినంటూ ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘‘మీ అక్రమాల చిట్టా మొత్తం మావద్ద ఉంది. మేం చెప్పినట్టు చేయకపోతే ఉద్యోగం పోవడమేకాదు, బెనిఫిట్స్‌ కూడా రాకుండా జైలుకెళ్తారు’’ అంటూ బెదరగొట్టినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారో కూడా చెప్పడంతో చేసేదిలేక వారి చెప్పిన ఖాతాలకు డబ్బులు జమచేశారని తెలిసింది. 

పక్కాగా వివరాలు తెలుసుకుని టార్గెట్‌
ఫేక్‌ ఏసీబీ ముఠాలో ఓ వ్యక్తి సీఐగా ఫోన్‌ చేయడం.. తరచూ తమ డీఎస్పీతో మాట్లాడాలంటూ చేసేవాడని మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు. తన కుమార్తె అమెరికాలో ఉందనే విషయం కూడా చెప్పారని తెలిపారు. రిటైర్డ్‌ స్టేజ్‌లో ఎందుకొచ్చిన∙సమస్య అనుకుని తాను వారి ఖాతాల్లోకి డబ్బు వేశానని చెప్పుకొచ్చారు. జరిగిన వ్యవహారాన్ని బట్టి ఫేక్‌ ఏసీబీ ముఠా అధికారులు, కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని టార్గెట్‌ చేసినట్లు బోధపడుతోంది.

చేయి ఎందుకు తడిపారు?
చిత్తూరు అర్బన్‌: లంచం తీసుకోవడం ఎంత నేరమో.. ఇవ్వడం కూడా అంతే తప్పు. నకిలీ ముఠా ఉచ్చులో పడ్డ అధికారులకు తొలుత ఫోన్‌ వచ్చినప్పుడే పోలీసులకు ఫిర్యాదుచేసి ఉండాల్సింది. అలా చేసినట్లయితే ఇపుడు ఇబ్బందులు వచ్చేవికావు. కానీ అలాచేయని అధికారులు దఫాలవారీగా ముఠా చెప్పిన బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. డబ్బులు ఇవ్వకుంటే ఎక్కడ తమపై కేసులు నమోదవుతాయోనని భయపడి లంచాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇది అధికారుల నిజాయితీని ప్రశ్నిస్తోంది.  

ఫోన్లకు భయపడొద్దు 
నకిలీ ఏసీబీ పేరిట పట్టుబడ్డ దొంగలు ఇచ్చిన సమాచారంతో జిల్లాలో దాడులు నిర్వహించాం. వీళ్ల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాల్సిన సమయంలో ఫెళ్లను తనిఖీ చేశాం. పలమనేరు కమిషనర్, ఆర్‌అండ్‌బీ ఈఈ నకిలీ ఏసీబీ ముఠాకు రూ.లక్షల్లో నగదు ఇచ్చారు. ఏ తప్పు చేయకుంటే ఎందుకు డబ్బులిచ్చారు..? లంచం ఇవ్వడం కూడా నేరమే. మాపరంగా నివేదికను ప్రభుత్వానికి పంపుతాం. చర్యలు తీసుకుంటారు. ఏసీబీ అని ఎవరైనా ఫోన్‌చేస్తే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయండి.  
– అల్లాభక్ష్, డీఎస్పీ, అవినీతి నిరోధకశాఖ, తిరుపతి  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top