ఉద్యోగం ఇప్పిస్తాం.. రూ. 67 లక్షలకు టోకరా

3 Men Cheats Rs 67 lakhs Over Job In Hyderabad Sachivalayam in Medak - Sakshi

25 మంది నుంచి రూ.67 లక్షలు స్వాహా 

ముగ్గురి అరెస్టు.. పరారీలో మరొకరు 

వివరాలు వెల్లడించిన సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ  

సాక్షి, సంగారెడ్డి‌: నిరుద్యోగుల అవసరాన్ని అసరాగా చేసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు. బుధవారం సంగారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రవీందర్‌.. ఆటోడ్రైవర్, కరీంనగర్‌ జిల్లా  చిగురుమామిడికి చెందిన బత్తిని వైకుంఠం.. రైతు. జిల్లాలోని కొండాపూర్‌ మండలం తొగర్‌పల్లికి చెందిన బందెమ్మ.. గృహిణి. వీళ్లు ముగ్గురికి సంగారెడ్డి పట్టణానికి చెందిన విజయ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌ సచివాలయంలో తనకు పరిచయాలు ఉన్నాయని విజయకుమార్‌ నమ్మబలికడంతో రవీందర్, వైకుంఠం అతనికి సహాయకులుగా ఉన్నారు. కాగా బందెమ్మ  25 మంది వద్ద నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండేళ్లుగా రూ.67 లక్షలు వసూలు చేసి వారికి అప్పగించింది. నిరుద్యోగులకు నకిలీ నియామక పత్రాలు అందజేశారు. విషయం తెలుసుకున్న డబ్బులు ఇచ్చిన పలువురు బాధితులు బందెమ్మను నిలదీశారు.

దీంతో తాను తప్పించుకోవడానికి డబ్బులు తీసుకొని రవీందర్, వైకుంఠం, విజయకుమార్‌లు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశారని నవంబర్‌ 9వ తేదీన సంగారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె సంగారెడ్డి మార్క్స్‌నగర్‌లో నివాసం ఉంటోంది. ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా నకిలీ ముఠాగుట్టు రట్టయ్యింది. పోలీసుల దర్యాప్తులో ఆమె సైతం నిందితురాలు అని తెలింది. దీంతో ఆమెతో పాటు రవీందర్, వైకుంఠాన్ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి బ్యాంకు చెక్‌ బుక్కులు,  మొబైల్‌ ఫోన్లు, నకిలీ నియామక పత్రాలను స్వాధీన పరుచుకున్నారు. కాగా విజయకుమార్‌ పరారీలో ఉన్నాడు.  ఆ ముగ్గురిని జ్యూడిషయల్‌ కస్టడీకి తరలించారు. కేసును ఛేదించిన పట్టణ సీఐ వెంకటేష్, ఎస్‌ఐ లక్ష్మారెడ్డిలను డీఎస్పీ అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top