– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
చిత్తూరు మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో అరాచకం
ప్రతి కేంద్రంలోనూ కూటమి నేతల రౌడీయిజం..
ఆర్వోలను బెదిరించి నామినేషన్ల తిరస్కరణ
కుట్రలతోనే తిరస్కరించారని ఆశావహుల ఆగ్రహం
ఆర్డీవో కార్యాలయానికి పోటెత్తిన బాధిత అభ్యర్థులు
వెల్లువెత్తిన అప్పీళ్లు
శ్రీవారి పడి సారె ఊరేగింపు ట్రయల్ రన్‌ను టీటీడీ అధికారులు విజయవంతంగా నిర్వహించారు.
6 వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంపకం
చిత్తూరు జిల్లాలో 6 వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంపకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు.
గురువారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2026
ఆర్డీవో కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు
చిత్తూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న తిరస్కరణకు గురైన సర్పంచ్, వార్డు అభ్యర్థులు
ఇది ముమ్మాటికీ దౌర్జన్యమే
నేను ఇప్పటికే మూడుసార్లు వార్డు సభ్యులుగా పోటీచేశాను. ప్రతి సారి గెలిచాను. ఇది వరకే ఉప సర్పంచ్ కూడా ఉన్నా. ఇంత వరకు నా నామినేషన్ ఎక్కడా తిరస్కరణ కాలేదు. నేను దాఖలు చేసిన పత్రంలో ఎలాంటి పొరపాట్లు లేవు. ఏవేవో కారణాలు చూపి ఈ ఎన్నికల్లో నా నామినేషన్‌ను తిరస్కరించేలా చేశారు. కూటమినేతలు దౌర్జన్యం వల్లే ఇలా నా నామినేషను తిరస్కరించారు.
– మనవాలన్, గువ్వకల్లు వార్డు అభ్యర్థి
ఏకగ్రీవమనే పేరుతో పచ్చవీరంగం
గతంలో పంచాయతీ ఎన్నికల్లో ఊళ్లోని పెద్దలు కూర్చుని ఊరంతా పిలిచి పంచాయితీ చేసేవారు. ఆశావహులతో మాట్లాడి అందరూ సర్దుకుని వెళ్లానని చెప్పేవారు. అందరి సమక్షంలో ఒకరిని ఏకగ్రీవం చేసేవారు. ఇప్పుడు కూటమి నేతల చేతిలో అధికారం ఉందని వీరంగం సృష్టిస్తున్నారు. నేను సర్పంచ్‌గా, వార్డు సభ్యుడిగా పలుసార్లు పోటీ చేశాను. ఇంత దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదు.
– రాజేంద్ర, కుర్పివేడు సర్పంచ్ అభ్యర్థి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా, అత్యంత ఉద్రిక్త వాతావరణంలో సాగింది. కూటమి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ నామినేషన్ పత్రాలను తిరస్కరింపజేశారని సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాధితులు బుధవారం చిత్తూరు నగరంలోని ఆర్డీవో కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అన్యాయంపై ఉన్నతాధికారులకు అప్పీళ్లు దాఖలు చేశారు. నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఎన్నికల ప్రక్రియలో ఇంతటి అరాచకాన్ని ఎన్నడూ చూడలేదని బాధితులు మండిపడ్డారు.
నామినేషన్ల కేంద్రాల వద్ద రౌడీయిజం
చిత్తూరు మండలంలోని ప్రతి నామినేషన్ కేంద్రంలోనూ కూటమి నేతలు నిబంధనలను తుంగలో తొక్కారని అభ్యర్థులు ఆరోపించారు. నామినేషన్ల పరిశీలన సమయంలో బయటి వ్యక్తులు ఇష్టారాజ్యంగా కేంద్రాలలోకి ప్రవేశించారని, రిటర్నింగ్ అధికారులను (ఆర్వో) భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లను తిరస్కరింపజేశారని పేర్కొన్నారు. ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసే హక్కును కాలరాస్తున్నారని, అధికారం చేతిలో ఉందని ఇంతగా దిగజారడం తగదని ఎండగట్టారు.
పరిశీలన తర్వాత మిగిలిన నామినేషన్ల లెక్క ఇదీ..
చిత్తూరు మండలంలో పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు పెద్ద ఎత్తున ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన అనంతరం సగానికి పైగా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సర్పంచ్ స్థానాలకు మొత్తం 198 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన తర్వాత 75 నామినేషన్లు మాత్రమే మిగిలాయి. అంటే ఏకంగా 123 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వార్డు సభ్య స్థానాలకు మొత్తం 436 నామినేషన్లు దాఖలు కాగా, చివరకు 152 నామినేషన్లు మాత్రమే మిగిలాయి. ఇక్కడ ఏకంగా 284 నామినేషన్లను తిరస్కరించారు.


