నేడే తొలి సం‘గ్రామం’ | - | Sakshi
Sakshi News home page

నేడే తొలి సం‘గ్రామం’

Nov 26 2026 1:17 AM | Updated on Nov 26 2026 1:17 AM

పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు 177 సర్పంచ్‌, 1,196 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ 717 మంది ఏకగ్రీవం బరిలో 2,976 మంది అభ్యర్థులు పోలింగ్‌ 7 నుంచి ఒంటి వరకు మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు

సాక్షి, చిత్తూరు/చిత్తూరు కార్పొరేషన్‌ : మరికొద్ది సేపట్లో పంచాయతీ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. తొలి విడత సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల్లో భాగంగా గురువారం పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌.. మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తవుతుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, వెనువెంటనే ఫలితాలు వెల్లడిస్తారు.

తొలి విడత 9 మండలాల్లోనే..

మూడు దశల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలను తొలి విడతగా 9 మండలాల్లో నిర్వహించనున్నారు. ఈ జాబితాలో కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం, పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట, పెద్దపంజాణి, గంగవరం మండలాలు ఉన్నాయి. అధికారులు మొత్తం 182 పంచాయతీలు, 1,908 వార్డు సభ్యుల స్థానాలకు తొలి దశలో నోటిఫికేషన్‌ ఇవ్వగా.. ఇందులో గంగవరం మండలంలోని చౌడిరెడ్డిపల్లె, పెద్దపంజాణిలో వీరప్పల్లె, కుప్పంలో నాయనూరు, బ్రహ్మదేవరచేను, దేవరాజపురం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 712 వార్డు సభ్యుల స్థానాలు సైతం ఏకగ్రీవం చేసుకున్నారు. మిగిలిన 177 సర్పంచ్‌ స్థానాలకు 494 మంది, 1,196 వార్డులకు 2,482 మంది బరిలో ఉన్నారు. తొలి దశలో 4,17,342 మంది ఓటర్లు, 1,690 పోలింగ్‌స్టేషన్లలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం 1,700 మంది పీఓ, ఏపీఓ, ఓపీఓలను నియమించారు.

గత ఎన్నికలు పాఠాలు నేర్పేనా..?

మునిసిపల్‌, ప్రాదేశిక ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు అందరికీ తెలిసిందే. చిత్తూరు నగరంలో అధికార పార్టీ నేతలు ఏకంగా పోలింగ్‌ బూత్‌లలోకి చొరబడి రిగ్గింగ్‌ చేసుకున్న వీడియోలు రాష్ట్రం మొత్తం ఇటువైపు చూసేలా చేశాయి. గుడిపాల, కుప్పం మండలాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై దాడులు చేయడంతోపాటు కిడ్నాప్‌లు కూడా చేశారు. ఇలాంటి తరుణంలో పల్లెపోరు ఒకే రోజులో పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ఉండడంతో అధికారుల్లో నిష్పక్షపాతం చాలా అవసరం. ఏ పార్టీకీ తలొగ్గకుండా నిక్కచ్చిగా విధులు నిర్వర్తించి ఎక్కడైతే పడిపోయారో, తిరిగి అదే ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించి లేచి నిలబడాల్సి ఉంది. అప్పుడే ప్రజలు కూడా యంత్రాంగాన్ని నమ్ముతారు. అలాకాదని కళ్లు మూసుకుంటే మాత్రం ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం ఖాయం. ప్రధానంగా ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు బాధ్యాయుతంగా వ్యవహరించాలి. శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ, ప్రజలు నిర్భయంగా ఓటు వేయడానికి పనిచేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement