పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లుండవు గుర్తులు మాత్రమే ఉంటాయి రెండు ఓట్లు..రెండు రంగుల బ్యాలెట్ పేపర్లు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం ఇలా
చిత్తూరు కార్పొరేషన్: గ్రామ పాలనకు పునాది వేసే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటరూ ఓటింగ్ ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు జరిగే పోలింగ్‌లో ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పత్రాల రంగులు, గుర్తుల ఆధారంగా జరిగే ఓటింగ్ విధానం, పోలింగ్ కేంద్రంలో అధికారుల విధులపై సమగ్ర వివరాలు..
అభ్యర్థుల పేర్లు ఉండవు.. గుర్తులే కీలకం
పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు ముద్రించరు. అభ్యర్థుల క్రమ సంఖ్య, వారికి కేటాయించిన ఎన్నికల గుర్తులు మాత్రమే ఉంటాయి. జాబితా చివరలో ‘నోటా’ గుర్తు కూడా ఉంటుంది. ఓటర్లు పోలింగ్‌కు ముందే తాము ఓటు వేయాలనుకుంటున్న అభ్యర్థుల గుర్తులు, క్రమ సంఖ్యలను గుర్తుంచుకోవడం మంచిది. కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాక తొందరపడకుండా సరైన గుర్తుపై నిర్దేశించిన రబ్బరు స్టాంపుతో ముద్ర వేయాలి.
పోలింగ్ కేంద్రంలో ప్రక్రియ, అధికారుల బాధ్యతలు
దాదాపు 200 మంది వరకు ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి (వీరిలో ఒకరికి అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి బాధ్యతలు ఉంటాయి), పోలింగ్ అధికారి విధులు నిర్వహిస్తారు. మొదట పోలింగ్ అధికారి ఓటరు గుర్తింపు కార్డు (ఎన్నికల సంఘం ఆమోదించిన ఇతర గుర్తింపు పత్రం) పరిశీలిస్తారు. గుర్తింపు పూర్తయ్యాక ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా వేస్తారు. ఓటరు క్రమ సంఖ్య, పోలింగ్ కేంద్రం నంబర్, వార్డు వివరాలు, గుర్తింపు పత్రం వివరాలను బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫాయిల్‌పై నమోదు చేసి, రెండు బ్యాలెట్ల కౌంటర్ ఫాయిల్స్‌పై ఓటరు సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు.
ఓటర్లకు ముఖ్య సూచనలు
బ్యాలెట్ పేపర్ మడత, స్టాంపు వినియోగంపై పోలింగ్ సిబ్బంది ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగకుండా రహస్యంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలి.
ఏ రంగు బ్యాలెట్ ఎవరికి?
వార్డు సభ్యుడి ఎన్నిక కోసం తెలుపు రంగు బ్యాలెట్ పేపర్, సర్పంచ్‌కు గులాబీ రంగు బ్యాలెట్ పేపరు ఇస్తారు. ఓటర్లు రెండు పేపర్లలోనూ తమకు నచ్చిన అభ్యర్థులకు సంబంధించిన గుర్తులపై ఓటు వేయాల్సి ఉంటుంది. అనంతరం ఆయా బ్యాలెట్ పేపర్లను నిబంధనల ప్రకారం వేర్వేరుగా మడత పెట్టి ఒకే బ్యాలెట్ బాక్స్‌లో వేయాలి.


