ఆర్టీసీ బస్సులో బంగారు గొలుసు చోరీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో బంగారు గొలుసు చోరీ

Nov 26 2026 1:17 AM | Updated on Nov 26 2026 1:17 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఆర్టీసీ బస్సులో 25 గ్రాముల బంగారు గొలుసు చోరీకు గురవడంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్‌ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. చిత్తూరు మండలంలోని పట్రాంపల్లె వద్ద ఉన్న విఘ్నేశ్వరనగర్‌కు చెందిన సుబ్రమణ్యమ్మ ఈ నెల 22వ తేదీన చిత్తూరు ఆర్టీసీ బస్టాండు నుంచి పీలేరు వెళ్లడానికి బస్సు ఎక్కారు. ఆధార్‌ కార్డు తీసే సమయంలో తన పర్సు కనిపించకుండా పోయింది. గుర్తుతెలియని వ్యక్తి తన పర్సులో ఉన్న బంగారు గొలుసు చోరీ చేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వన్‌టౌన్‌ సీఐ చిన్నపెద్దయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

30న హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు స్పాట్‌ కౌన్సెలింగ్‌

తిరుపతి తుడా : స్విమ్స్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీకోసం స్పాట్‌ కౌన్సెలింగ్‌ను ఈనెల 30 వతేదీన నిర్వహించనున్నట్లు డీన్‌ డాక్టర్‌ అలోక్‌ సచన్‌ తెలిపారు. ఈ కోర్సులో 6 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు సోమవారం ఉదయం 8.30 గంటలకు స్విమ్స్‌ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో హాజరుకావాలని సూచించారు. ఈ మేరకు వారు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

లారీ చక్రాల కింద పడి మహిళ దుర్మరణం

తిరుపతి రూరల్‌ : పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. తిరుపతి ఎమ్మార్‌పల్లెకు చెందిన జగదాంబ (50) ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. వివరాలు.. తిరుపతి వైకుంఠపురానికి చెందిన పద్మావతి, తన సమీప బంధువు జగదాంబతో కలసి ద్విచక్రవాహనంలో చంద్రగిరి వైపు వెళుతుండగా అదుపుతప్పి కిందపడ్డారు. వాహనం నడుపుతున్న పద్మావతి డివైడర్‌ వైపు పడగా వెనుక కూర్చున్న జగదాంబ నడిరోడ్డుపై పడడంతో పక్కనే వెళుతున్న లారీ చక్రాలు ఆమె తలపైకి ఎక్కేశాయి. దీంతో జగదాంబ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు అక్కడకు చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జగదాంబ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పద్మావతి ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైవే నిర్మాణ పనులతోనే..

పూతలపుట్టు–నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా సాగుతుండడంతోనే ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా రోడ్డు గుంతలమయంగా మారిందని, అందులో వర్షపు నీరు నిలవడం తరచూ పలువురు ప్రమాదాలకు గురవుతున్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి, ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జాతీయ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఘనంగా ఇంటర్‌ పాలిటెక్నిక్‌ క్రీడోత్సవాలు

చంద్రగిరి : శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో 14వ ఇంటర్‌ పాలిటెక్నిక్‌ క్రీడలు, సాంస్కృతిక, సాహిత్య సమ్మేళనం–2026 బుధవారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ పశువైద్య పాలిటెక్నిక్‌ కళాశాలల నుంచి సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్పోర్ట్స్‌ కమిటీ చైర్మన్‌ రాంబాబు నాయక్‌, యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ వైకుంఠరావు, టీటీడీ సీవీఎస్‌ఓ మురళీ కృష్ణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవచ్చని తెలిపారు. రాపూరు పశువైద్య పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చైతన్య కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement