ఇద్దరు రిటర్నింగ్‌ అధికారులపై వేటు! | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు రిటర్నింగ్‌ అధికారులపై వేటు!

Nov 26 2026 1:17 AM | Updated on Nov 26 2026 1:17 AM

● చిత్తూరు మండలంలో ఆర్వోల ఇష్టారాజ్యం ● ఒత్తిళ్లతో.. ఏకపక్షంగా అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ ● అధికార పార్టీ నేతలు చెప్పినట్టల్లా ఆడిన వైనం ● కలెక్టర్‌కు ఫిర్యాదు.. ఇద్దరు హెచ్‌ఎంల సస్పెన్షన్‌

సాక్షి, చిత్తూరు: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకూడదు. ఇద్దరు రిటర్నింగ్‌ అధికారులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్టల్లా ఆడారు. చివరకు ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకున్నారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో చిత్తూరు నియోజకవర్గంలో ఇష్టానుసారంగా వ్యవహరించి, నిబంధనలు బేఖాతరు చేసినందుకు బీఎన్‌ఆర్‌.పేట ఆర్వో విజయకుమారి, తుమ్మింద ఆర్వో దుర్వాసులును సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, తన అనుమతిలేనిదే జిల్లా వదిలి వెళ్లడానికి వీలు లేదని పేర్కొన్నారు.

అంతా ప్లాన్‌ ప్రకారం..

కాగా సస్పెన్షన్‌కు గురైన ఆర్వోలు బి.విజయకుమారి గుడిపాల మండలం మిట్టయిండ్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. బిఎన్‌ఆర్‌.పేట ఆర్వోగా నియమితులైన ఈమె నామినేషన్ల పరిశీలన సమయంలో నిబంధనలను ఏమాత్రం పాటించలేదు. మంగళవారం ఉదయం 6 గంటలకే నామినేషన్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఇంత ఉదయాన్నే ఎందుకు ఇక్కడకు వచ్చారు..? ఏం చేయాలనుకుంటున్నారు..? అంటూ గ్రామ ప్రజలు నిలదీయడంతో నీళ్లు నములుకుంటూ వెళ్లిపోయారు. ఇక పరిశీలన సమయంలో ప్రత్యర్థులు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకపోయినా, కుంటిసాకులు చూపించి పలు నామినేషన్లను తిరస్కరించారు. ఇక కె.దుర్వాసులు గుడిపాల మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ.. చిత్తూరు మండలం తుమ్మింద ఆర్వోగా నియమితులయ్యారు. చిత్తూరుకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి సహాయకుడికి ఇతను వరుసకు అన్న. ఉద్దేశపూర్వకంగానే ఇతనికి ఆర్వో విధులు కేటాయించి, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడానికి ప్రణాళిక రూపొందించినట్లు ఆరోపణలున్నాయి. ఇతని పరిధిలోనూ ఎలాంటి స్పష్టమైన ఆధారాలు చూపించకుండా నామినేషన్లను తిరస్కరించారు. దీంతో ఇతనిపై వేటు పడింది. ఆర్వోలు ఇంత బరితెగించి విధులు నిర్వర్తించడం వెనుక, అధికార పార్టీ ప్రజాప్రతినిధితో పాటు ఓ జిల్లా స్థాయి అధికారి అభయహస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్వోలకు ఏ సమస్య వచ్చినా, తాను చూసుకుంటానని ఆ అధికారి చెప్పడంతోనే నామినేషన్లను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఇదీ వివాదం..

మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన మంగళవారం నిర్వహించిన విషయం తెలిసిందే. చిత్తూరు రూరల్‌ మండలంలోని ఎన్‌ఆర్‌.పేట, తుమ్మింద నామినేషన్ల కేంద్రాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లకు ఈ ఇద్దరు ఆర్వోలు ఎలాంటి కారణాలు చూపకుండా ఏకపక్షంగా తిరస్కరించారు. నామినేషన్ల పరిశీలన సమయంలో చిన్నపాటి లోటుపాట్లు ఉన్నా కూడా వాటిని ఆమోదించాలని ఎన్నికల నిబంధనల్లో ఉంది. ఈ ఇద్దరు ఆర్వోలు అధికారపార్టీ నేతలు చెప్పినట్లు తలూపి, పోటీలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను కుంటి సాకులు చూపించి వాటిని తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన అభ్యర్థులు, గ్రామాల్లోని ప్రజలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేసి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కలెక్టర్‌ ఇద్దరు ఆర్వోలను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement