సుదూర ఓటర్లే గెలుపు నిర్ణేతలు
ఇతర ప్రాంతాల్లోని ఉన్న వారిపై అభ్యర్థుల ప్రత్యేక దృష్టి
రానుపోను ప్రయాణ ఖర్చులు, వాహనాల ఏర్పాటుకు సిద్ధం
బంధువులు, స్నేహితుల ద్వారా ముమ్మరంగా రాయబారాలు
పంచాయతీ పోరులో ప్రతి ఓటరు కీలకం
చిత్తూరు కార్పొరేషన్: పంచాయతీ పగ్గాలు చేజిక్కించుకునే వ్యూహంలో బరిలోని అభ్యర్థులు పట్టణాల్లో ఉన్న తమప్రాంత ఓటర్లపై దృష్టి పెట్టారు. సొంత గ్రామాల్లో ఓటుండి.. ఉపాధి, ఉద్యోగం, వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లను స్వగ్రామాలకు రప్పించి తమకు ఓటేసేలా బరిలోని అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘ఊరికి రండి.. మా గుర్తుకు ఓటెయ్యండి’ అంటూ ఫోన్లు, వాట్సాప్ సందేశాలతో అభ్యర్థిస్తున్నారు. రానుపోను ప్రయాణ ఖర్చులు భరించడంతో పాటు వారి ప్రయాణ టికెట్లను ముందస్తు బుకింగ్ చేసి పంపే ప్రక్రియకు సమాయత్తమవుతున్నారు.
మూడు విడతల్లో ఎన్నికల సమరం
జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఈ నెల 26న, రెండో విడత 29న, మూడో విడత డిసెంబర్ 2న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 617 పంచాయతీలు, 5,866 వార్డులకు సంబంధించి 5,866 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లాలో 10,22,742 మంది ఓటర్లు ఉండగా, పంచాయతీకి సగటున 200 మంది చొప్పున లెక్కేసుకున్నా సుమారు లక్ష మంది పైగా ఓటర్లను సుదూర ప్రాంతాల నుంచి రప్పించాల్సి ఉంటుందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు.
టికెట్ల బుకింగ్ నుంచి కార్ల ఏర్పాటు వరకు..
హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఉద్యోగ, వ్యాపారాలను చేస్తున్న గ్రామ ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు వారి బంధుపరివారం వద్ద ఫోన్ నంబర్లను సేకరించి, ఫోన్ చేసి కుశల ప్రశ్నలతో మాటకలుపుతున్నారు. పోలింగ్ రోజున సొంతూరికొచ్చి ఓటేసేందుకు రైలు, బస్సు టికెట్లు రిజర్వేషన్ చేయిస్తున్నారు. ఓటేసి తిరిగి వెళ్లేందుకు వీలుగా రానుపోను ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో జిల్లా వాసులు ఎక్కువగా ఉద్యోగం, వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కువ ఓట్లు ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేకంగా కార్లను పంపేందుకు సిద్ధమవుతున్నారు.
స్థానికేతర ఓటర్లే నిర్ణేతలు
గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండడం, అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా నెలకొనడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లకు ప్రాధాన్యత పెరిగింది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని నేరుగా ఫోన్‌లో సంప్రదించడమే కాకుండా, గ్రామంలోని వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ద్వారా అభ్యర్థులు ముమ్మరంగా రాయబారాలు నడుపుతున్నారు. వారి ఓటానుగ్రహం కోసం అభ్యర్థులు చేస్తున్న విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు.


