అధర్మం, దౌర్జన్యాల మధ్య ఆత్మస్థైర్యంతో విజయం
జీడీ నెల్లూరులో 3 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం
చరిత్ర సృష్టించిన మండలాధ్యక్షులు
సాక్షి, చిత్తూరు: ప్రాదేశిక ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గురువారం ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా ప్రమాణ స్వీకారం చేసి, జిల్లా స్థాయిలో పార్టీ జెండాను సగర్వంగా ఎగురవేశారు. ఇందులో పెనుమూరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 7 స్థానాలు, వెదురుకుప్పం మండలంలో 13 స్థానాలకు గాను 9 స్థానాలు, శ్రీరంగరాజపురం మండలంలో 11 స్థానాలకు గాను 9 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. ఇక జెడ్పీటీసీ స్థానాల విషయానికొస్తే కార్వేటినగరం, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పెనుమూరు మండలాల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది.
వరించిన విజయం..
గురువారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పెనుమూరు ఎంపీపీగా అనూషా రెడ్డి, వైస్ ఎంపీపీగా శిల్పారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వెదురుకుప్పం ఎంపీపీగా వెంకటేశులు, వైస్ ఎంపీపీగా సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్రీరంగరాజపురం ఎంపీపీగా భార్గవి, వైస్ ఎంపీపీగా మురళి ప్రమాణ స్వీకారం చేశారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నామినేషన్లు వేయడానికి వెళితే తలలు పగులగొట్టారు. మహిళల కొంగు లాగుతూ నడిరోడ్డుపై దుశ్శాసన పర్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. అసలు నామినేషన్ పత్రాలే దాఖలు చేయకుండా చించి పడేశారు. ఒకవైపు అధికార బలం.. మరోవైపు ఖాకీల అండ.. ఇన్ని కుట్రలు, కుతంత్రాల మధ్య మొక్కవోని ధైర్యంతో
ఎదురు నిలబడి పోరాడారు. వైఎస్సార్సీపీపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని జిల్లా మొత్తానికి
చాటిచెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఏకంగా 25 ఎంపీటీసీ స్థానాలను కై వసం
చేసుకున్నారు. నియోజకవర్గంలోని మూడు స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మండల
అధ్యక్ష పీఠాలను అధిరోహించారు.


