దూసుకొచ్చిన మృత్యువు..! | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు..!

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

రోడ్డు పక్కన ధాన్యం తూర్పారపడుతున్న మహిళపై దూసుకెళ్లిన కారు

అక్కడిక్కడే ఒకరి దుర్మరణం. ఆస్పత్రికి వెళుతూ మరో ఇద్దరి మృతి

మృతుల్లో అత్తా కోడలు, మరో బంధువు

అందరూ కూలిపనులు చేసుకునే కష్ట జీవులు

పెంగరగుంటలో విషాధ ఛాయలు

‘‘ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యపు రాశులు ఇల్లు చేరిన ఆనందం ఆస్వాదిస్తున్నంతలోనే అనూహ్యంగా దూసుకొచ్చిన కారు వారింట పెను కల్లోలం సృష్టించింది. ఒకే కుటుంబంలో

ఇద్దరు, మరో కుటుంబంలో ఒక మహిళ మృత్యు ఒడికి చేరడంతో మృతుల కుటుంబీకుల ఆక్రందనను ఆపడం ఎవరితరం కాలేదు. కారు మృత్యు శకటమై ముగ్గుర్ని బలితీసుకోవడంతో

గ్రామంలోని వారంతా గుండె తరుక్కుపోయేలా రోదించారు.’’

పలమనేరు: వారంతా కూలినాలి చేసుకుని కుటుంబాలవారే.. తమ పొలాల్లో సాగైన వరిపంటను నూర్పిడి చేసి ఆ వరిధాన్యాన్ని ఇంటి ముందు రోడ్డు పక్కన తూర్పారపడుతుండగా వేగంగా దూసుకొచ్చిన తార్‌ కారు ఢీకొట్టి ముగ్గురు మహిళలు దుర్మరణం పాలైన విషాద ఘటన పలమనేరు–గుడియాత్తం మార్గం పలమనేరు మండలం పెంగరగుంట వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. పెంగరగుంటకు చెందిన మునస్వామి భార్య సాలమ్మ(75), ఆమె కోడలు మునెమ్మ(45), వీరి బంధువు ఆర్‌. జ్యోతి(50)లు గ్రామంలోని ఇంటి ముందు రోడ్డు పక్కన వరిధాన్యం నూర్పిడి చేస్తుండగా పలమనేరు వైపునకు వేగంగా దూసుకొచ్చిన తార్‌ కారు రోడ్డు పక్కన ఉన్న ఈ ముగ్గురిపైకి అదుపుతప్పి దూసుకెళ్లింది. దీంతో ప్రమాదస్థలిలోనే వృద్ధురాలు సాలమ్మ మృతి చెందింది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితికి చేరుకున్న మునెమ్మ, జ్యోతిలను చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు వేలూరు సీఎంసీకి తరలిస్తుండగా మార్గం మధ్యలనే ఆ ఇద్దరూ మృతి చెందారు. దీంతో ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

జనంపై దూసుకెళ్లి మరింత వేగంతో వెళ్లిన కారు

ముగ్గురిపై దూసుకెళ్లిన కారు మరింత వేగంగా ముందుకెళ్లినట్టు ప్రత్యక్ష్య సాక్షులు చెబుతున్నారు. దీంతో కొందరు యువకులు తమ బైక్‌లపై కారును చేజ్‌ చేసేందుకు ప్రయత్నించగా పలమనేరు పట్టణం దాటి కారు బెంగళూరు రోడ్డువైపు వేగంగా దూసుకెళ్లినట్టు తెలిపారు.

మృతుల కుటుంభాలను

ప్రభుత్వం ఆదుకోవాలి

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు.

మృతి చెందిన సాలమ్మకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఈమె కోడలు మునెమ్మ కూడా కారు కింద పడి తనువు చాలించింది. ఈమెకు ఓ కుమారుడున్నాడు. మరో మృతురాలు వీరి సమీప బంధువు జ్యోతి. ఈమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అందరూ కూలినాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రోడ్డుకు దూరంగా ప్లాట్‌ఫామ్‌ వద్ద వ్యవసాయ పనుల్లో వీరు నిమగ్నమై ఉండగా వీరిౖపైకి కారు వేగంగా దూసుకొచ్చింది. కనీసం తప్పించుకునేందుకు కూడా వీలులేకుండా పోయింది.

పెంగరగుంటలో విషాదఛాయలు

అనూహ్య కారు ప్రమాదంలో తమ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మృత్యువాత పడడంతో పెంగరగుంట గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామస్తులంతా ఆస్పత్రి వద్దకు, మరికొందరు పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. జరిగిన ప్రమాదంపై పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement