మరీ ఇంత నిర్లక్ష్యమా శివా? | - | Sakshi
Sakshi News home page

మరీ ఇంత నిర్లక్ష్యమా శివా?

Nov 13 2026 3:47 AM | Updated on Nov 13 2026 3:47 AM

● శ్రీకాళహస్తీశ్వరాలయంలో అగ్నిప్రమాద నివారణ చర్యలు శూన్యం ● ఫైర్‌ సేఫ్టీ సూచనలు బేఖాతర్‌ ● రాహుకేతు పూజలపై ఉన్న శ్రద్ధ ప్రసాదాల తయారీపై లేదా? ● ప్రమాదం జరిగితే అంతేనా?

శ్రీకాళహస్తి: ప్రపంచ ప్రఖ్యాత గాంచిన వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రసాదాల పోటులో భారీ ఎత్తున అగ్నిప్రమాదం జరగడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇరుకు గదుల్లో.. తాత్కాలిక షెడ్డు ల్లో ప్రసాదాలు తయారు చేయడం.. అక్కడ కనీస భద్రతా ప్రమాణాలు, అగ్నిప్రమాద నివారణ చర్య లు చేపట్టకపోవడం.. అపరిశుభ్రత తదితర అంశాలు అధికారులు, పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ప్రసాదాల పోటులో ప్రమాదం జరిగితే సిబ్బంది కనీసం తప్పించుకునే సౌకర్యమూ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేవలం రాహు–కేతు పూజలపై ఉన్న శ్రద్ధ మిగిలిన వాటిపై ఎందుకు లేదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

కోటి ఆదాయం దాటినా..?

శ్రీకాళహస్తీశ్వరాయ ఆదాయం నానాటికీ పెరుగుతోంది. ప్రస్తుతం నెలకు దాదాపు కోటి రూపాయల పైనే సమకూరుతోంది. ఇంతటి ఆదాయం వస్తున్నా కనీసం పోటు లాంటి ముఖ్యమైన వాటిని పటిష్టంగా నిర్వహించాలన్న ఆలోచన అధికారులు, పాలకులకు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఓ పోటులో బూందీ, లడ్డూ, జిలేబీ, వడ తయారు చేస్తారు. మరో పోటులో పులిహోరా మాత్రమే తయారు చేస్తారు. లడ్డూ తయారీకి 60 లీటర్ల బాండిళ్లు ఉన్న రెండు పెనాలు, 30 లీటర్ల సామర్థ్యమున్న మరో రెండు పెనాలను ఉపయోగిస్తున్నారు. వీటిలో రోజుకు పదివేల లడ్డూలు, ఐదువేల వడలు తయారు చేస్తారు. గ్యాస్‌ సిలిండర్లను బయట పెట్టి, వాటి నుంచి పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ను పొయ్యకు అనుసంధానం చేశారు. గ్యాస్‌ ఒత్తిడి పెరిగేందుకు తరచూ పైపులైనుపై సిబ్బంది వేడినీటిని పోస్తుంటారు. ఇక్కడ నలుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. గురువారం ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

పోటుపై శ్రద్ధ లేదెందుకో

ఆలయ అధికారులు, పాలక మండలికి శ్రీకాళహస్తీశ్వరాలయ పోటుపై శ్రద్ధలేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ఆదాయం వచ్చే రాహుకేతు పూజా మండపాలు, అందులో వచ్చే కమీషన్లపైనే శ్రద్ధ చూపుతున్నారని భక్తులు చెబుతున్నారు. రోజుకు రూ.7 లక్షలకు పైగా ఆదాయం వచ్చే ప్రసాదాల పోటుపై ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని చర్చించుకుంటున్నారు. శాశ్వత పోటు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

సంప్రోక్షణ చేస్తారా?

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో లక్ష బిల్వార్చన నిర్వహిస్తున్నారు. అలాంటి సమయంలో ఆలయ పోటులో అగ్నిప్రమాదం జరగడం.. ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లేలా ఉందని స్వామీజీలు కొందరు చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆలయ సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. పైగా దీనిపై ఓ కమిటీని వేసి నిజనిర్ధారణ చేయాలని, ప్రమాదానికి గల కారణాలను భక్తులకు తెలియజేయాలని స్థానికులు సూచిస్తున్నారు.

నిర్లక్ష్యం.. అపరిశుభ్రం

లడ్డూ తయారీ పోటులో అడుగడుగునా అపరిశుభ్రం కనిపిస్తోంది. పొగ, ఆవిరిని బయటకు పంపించే ఎగ్జిస్టింగ్‌ ఫ్యాన్లను ఆలయ గోడకు మళ్లించారు. వాటి నుంచి వచ్చే నెయ్యి తుంపర్లతో గోడ మొత్తం పేరుకుపోయింది. అలాగే లడ్డూ తయారీ పెనాల నుంచి వచ్చే ఆవిరి, నెయ్యి సమీప గోడకు తగిలి సుమారు అంగుళం ఎత్తు పాచిలాగా పేరుకుపోయింది. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో వీటికి అంటుకోవడంతోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. దీనికితోడు పోటుకు నీటి కనెక్షన్‌ లేకపోవడం, విద్యుత్‌ ప్యానళ్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిప్రమాద నివారణ చర్యలు, అగ్నిమాపక పరికరాల ఏర్పాటు వంటి అంశాలను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement