చిత్తూరు కలెక్టరేట్: చిన్నారుల్లో న్యుమోనియా వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్యం అందిస్తే నివారించవచ్చని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. చిన్నారుల్లో న్యుమోనియా నివారణ, వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించడానికి సాన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన గురువారం జెడ్పీ కార్యాలయంలో కార్యక్రమ ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లల్లో న్యుమోనియా లక్షణాలు, వ్యాధి తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగంగా శ్వాసించడం వంటి లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) ప్రాధాన్యతను వివరిస్తామని తెలిపారు. అర్హులైన చిన్నారులకు నిర్ణీత వయస్సులో టీకాలు వేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. న్యుమోనియా అనుమానిత కేసులను గుర్తించి నిర్దేశిత వైద్య విధానాల ప్రకారం చికిత్స అందించాలన్నారు. చిన్నారుల చికిత్సకు అవసరమైన జెంటామైసిన్ ఇంజెక్షన్లు, అమోక్సిసిలిన్ సిరప్‌ను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు.


