● ఆత్మీయ కలయిక తాడేపల్లెలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలసిన ఎమ్మెల్సీ భరత్
● డిసెంబర్ 31 లోపు నిధి పోర్టల్‌లో వివరాలు తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) నుంచి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి మారేందుకు దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో లక్ష్మినారాయణ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ 2003 టీచర్లకు కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ విడుదలై, ఆ తేదీ, ఆ తర్వాత విధుల్లో చేరిన టీచర్లు ఓపీఎస్‌కు అర్హులన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అర్హులైన టీచర్లు డిసెంబర్ 31వ తేదీలోపు నిధి పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. ఇందుకు ప్రారంభ నియామక అధికారి వద్ద అనెక్సర్–2ఏ నమూనాలో దరఖాస్తు చేసి డీఎస్సీ–2003 నియామక ప్రకటన, ఎంపిక జాబితా, నియామకపు ఉత్తర్వులు, విధుల్లో చేరేందుకు అనుమతించిన ఉత్తర్వులను (సర్టిఫైడ్ కాపీలు) పొందాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు అందిన 15 పనిదినాల్లో అధికారులు ధృవీకృత కాపీలను అందజేస్తారని పేర్కొన్నా రు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని టీచర్లు తమ సందేహాల నివృత్తి, ధృవీకరణ దరఖాస్తుల సమర్పణకు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని నియమించామని తెలిపారు. ఇతర వివరాలకు చిత్తూరు డీఈవో కార్యాలయంలోని తులసీరామ్ 96425 91266, అజయ్ వర్ధన్ 8498991250, రెడ్డిప్రసాద్ 9603002458ను సంప్రదించాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 73,392 మంది స్వామిని దర్శించుకున్నారు. 33,288 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. స్వామికి కానుకల రూపంలో హుండీలో రూ.3.90 కోట్లు వచ్చాయి. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
బీసీలకు తగ్గిన సర్పంచ్ స్థానాలు
తిరుపతి అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 26, 29న రెండు విడతల్లో జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రిజర్వేషన్లు చూస్తే బీసీలకు కేటాయించిన సర్పంచ్ స్థానాల సంఖ్య తగ్గించారు. అన్ రిజర్వుడు స్థానాలే అధికంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 807 పంచాయతీలు ఉండగా 30 పంచాయతీల్లో కోర్టు కేసుల నేపథ్యంలో ఎన్నికలు నిలుపుదల చేశారు. దీంతో 777 పంచాయతీల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అన్ రిజర్వుడుకు పురుషులకు 194, మహిళలకు 204 మొత్తం 399 కేటాయించారు. అలాగే బీసీల్లో పురుషులకు 42, మహిళలకు 52 మొత్తం 94 స్థానాలు కేటాయించారు. ఎస్సీల్లో పురుషులకు 114, మహిళలకు 101, మొత్తం 215 స్థానాలు, అలాగే ఎస్టీల్లో పురుషులకు 45, మహిళలకు 25 మొత్తం 70 స్థానాలు కేటాయింపు చేశారు. మొత్తంగా చూస్తే బీసీల స్థానాలు తగ్గించడంపై ఆ సామాజిక వర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


