నిస్తేజం..
జిల్లాలో పోలీసుల వ్యవహారశైలి దారుణంగా తయారైంది. ప్రధానంగా మున్సిపల్.. పరిషత్ ఎన్నికల సమయంలో రక్షకభట యంత్రాంగం నిస్తేజంగా మారింది. కూటమి నేతల కనుసన్నల్లోనే పనిచేసింది. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు చుక్కలు చూపించింది. చివరకు కార్యకర్తల కంటే అధికంగా అధికార పార్టీకి కొమ్ముకాసింది. శాంతిభద్రతలను సైతం గాలికి వదిలేసి పచ్చమూకలకు సహకరించింది. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రౌడీలు దాడులు చేస్తుంటే కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. అంతటితో ఆగకుండా బాధితులపైనే కేసులు నమోదు చేసి ఖాకీ యూనిఫామ్ పరువును నిలువునా తీసేసింది.
సాక్షి, చిత్తూరు : ఎన్నికలు సజావుగా నిర్వహించాలంటే రాజకీయ నేతల సహకారం అవసరం. వాళ్ల నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోయినా సామాన్యుడికి ఇబ్బంది రాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంటుంది. అందులోనూ పోలీసుశాఖ తన విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే పోలింగ్ ప్రక్రియ అపహాస్యం అవుతుంది. ప్రస్తుతం నాలుగో సింహం ఇదే అపవాదును మూటగట్టుకుంది. మున్సిపల్.. ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు ఖాకీల ఉనికిని ప్రశ్నిస్తున్నాయి.
పాఠం నేర్పని పుర‘క్షేత్రం’
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నగరిలో వైఎస్సార్‌సీపీ అఽభ్యర్థి తామరసెల్వి నామినేషన్‌ను పచ్చమూక లాక్కొని చింపేసింది. ఆమెను ప్రతిపాదించడానికి వెళ్లిన మహేశ్వరన్‌పై దాడిచేసి తలపై కొట్టడంతో రక్తగాయాలయ్యాయి. 36వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇంద్రయ్య నామినేషన్ కూడా టీడీపీ గూండాలు చింపేశారు. ఇక్కడి నుంచే జిల్లాలో పచ్చ మూకల అల్లర్లు పురుడుపోసుకున్నాయి. కుప్పంలో నామినేషన్ వేయడానికి వెళ్లిన చైర్మన్ అభ్యర్థి విజయ్‌ను కిడ్నాప్ చేశారు. అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రాజ్‌కుమార్, జయశంకర్, హఫీజ్‌ను రక్తం వచ్చేలా చావబాదారు. ఓ దశలో ఎస్పీ చెబితే.. సాయంత్రానికి రాజ్‌కుమార్‌ను వదలిపెట్టి.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బలవంతపు వీడియో రిలీజ్ చేయించారు. అదే రోజున చిత్తూరులో టీడీపీ నేత నామినేషన్ ఆమోదించడంపై ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకుడు సయ్యద్‌బాషాను కాళ్లతో తన్నుతూ, బండరాయితో తలపై మోది రక్తం వచ్చేలా కొట్టారు. నామినేషన్ల ఉప సంహరణ రోజున చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయాన్ని చుట్టేసిన వేలాది మంది పచ్చ గూండాలు పోలీసుల ఎదుటే వైఎస్సార్‌సీపీ నేతల చేతుల్లోని బీఫారాలను లాక్కుని చింపేశారు. కార్యాలయంలోకి ఎవరూ వెళ్లకుండా కాపుగాచి, అడ్డొచ్చిన న్యాయవాది సుగుణశేఖర్‌రెడ్డిపై దాడి చేశారు. వారం రోజుల తర్వాత ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం. ఇక పోలింగ్ రోజున చిత్తూరు వళ్లియప్పనగర్ బూత్‌లో టీడీపీ మూకలు చొరబడి రిగ్గింగ్ చేస్తుంటే, పోలీసులు బయట కాపలా ఉన్న వీడియోలు ఆ శాఖ పరువును బజారున పడేశాయి.
పంచాయతీపై పట్టు సాధిస్తారా..?
మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో పరువుపోగొట్టుకున్న పోలీసులకు ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పంచాయతీ ఎన్నికలు మరో సవాలును విసురుతున్నాయి. జిల్లాలోని 621 పంచాయతీల్లో మూడు విడతలుగా జరిగే పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే పడ్డ చోటే ఖాకీలు నిలబడినట్టవుతుంది. దీనిపై ఏ ప్రణాళికతో ముందుకు వెళతారో..? ఎప్పటిలా ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా ఓటు వేసేలా చేస్తామని ప్రకటనలకే పరితమై.. మరో అపవాదు మూటగట్టుకుంటారో వేచి చూడాలి.
ప్రాదేశికంలోనూ రెచ్చిపోయారు
మున్సిపల్ ఎన్నికల్లో ఖాకీల పనితీరు చూసిన పచ్చ మూకలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ రెచ్చిపోయారు. నామినేషన్ల వేళ చిత్తూరు జెడ్పీ కార్యాలయం వద్ద గంగాధరనెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ తన గూండాలతో కాపుగాచారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేయించారు. జెడ్పీటీసీ అభ్యర్థులు జగదీష్‌రెడ్డి, ప్రకాష్, దేవప్పనాయుడు, శ్రీనివాసరెడ్డి, దేవిప్రియకు రక్తగాయాలయ్యాయి. ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడానికి యత్నించిన బంగారుపాళ్యం, వెదురుకుప్పం, వి.కోట, చిత్తూరు అభ్యర్థులపై దాడులు జరిగాయి. ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని టీడీపీ మూకలు కొట్టంది ఒక్కటే.. ఆయన కారుపై దాడి చేసి భయబ్రాంతులకు గురిచేశారు. రెండు రోజుల క్రితం పోలింగ్ రోజున వైఎస్సార్‌సీపీ నాయకులను బైండోవర్ల పేరిట పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో టీడీపీ నాయకులు బూత్‌లలో సైర్వ విహారం చేశారు. చిత్తూరు మండలం, గుడిపాల, శాంతిపురం, పెనుమూరు, పలమనేరు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పచ్చ గూండాలు దాడులకు పాల్పడ్డారు.


