పాలసముద్రం : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దారుణంగా పచ్చమూక దాడులకు పాల్పడిందని, ఎమ్మెల్యే థామస్ నేతృత్వంలోనే అరాచకాలు సాగుతున్నాయని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డా రు. శుక్రవారం పాలసముద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జెడ్పీటీసీ అభ్యర్థి భర్త షణ్ముగం యాదవ్‌తోపాటు పత్రికా విలేకర్లపై సైతం టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుండగా బలిజకండ్రిగ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ చేసేందుకు ఎమ్మెల్యే థామన్, చిట్టిబాబు నాయుడు తమ అనుచరులతో చొరబడ్డారని ఆరోపించారు. అధికారులు, ఏజెంట్లను బెదిరిస్తుండగా అడ్డుకోబోయిన షణ్ముగంయాదవ్‌ను కొట్టారని, పైగా తిరి గి కేసులు పెడతామని భయపెట్టేందుకు యత్నించార ని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పత్రికా విలేకరి ఫోన్ సైతం లాగేసుకున్నారని వెల్లడించారు. ఎన్నడూ లేనివిధంగా నామినేషన్ పత్రాలను చించివేయడం, పో లింగ్ కేంద్రం అవరణంలో దౌర్జన్యాలకు పాల్పడడం వంటివి టీడీపీ నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. కేవలం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధించడం, కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అన్బళగన్, పార్టీ మండల కన్వీనర్ తులసి యాదవ్, మాజీ కన్వీనర్ సుందరరాజు, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మదివానన్, నేతలు రవిరెడ్డి, పోలయ్య, వెంకటేష్, ఆనందన్, షణ్ముగరెడ్డి, త్యాగరాజ్ పాల్గొన్నారు.


