జిల్లాలో పచ్చ నేతల డైరెక్షన్‌లోనే వ్యవహారం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ప్రతిపక్షాలే టార్గెట్ కేసులు లేకున్నా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కక్షసాధింపు టీడీపీకి మినహాయింపులు.. రెబెల్స్‌నూ వదలని నైజం
సాక్షి టాస్క్‌ఫోర్స్: స్థానిక ఎన్నికల వేళ జిల్లాలో పోలీసు యంత్రాంగం అధికార టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతోందనే విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాల్సిన అధికారులు.. అధికార పార్టీ నేతలు ఇచ్చే జాబితాల ప్రకారం ఏకపక్షంగా బైండోవర్ చర్యలకు దిగుతుండడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ నేతలు, కొందరు ప్రజాప్రతినిధుల కార్యాలయాల నుంచే పేర్లు పంపి, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ శ్రేణులను, నాయకులను లక్ష్యంగా చేసుకుని బైండోవర్లు చేయిస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు.
కేసులు లేకపోయినా వేధింపులు
గతంలో ఎలాంటి నేర చరిత్ర, కేసులు లేకపోయినా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు అన్న కారణంతో ఎంతోమందిపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారు. బాధితులను రోజంతా పోలీస్ స్టేషన్లలోనే కూర్చోబెట్టాలని అధికార పార్టీ నేతల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా టీడీపీలో రెబెల్ అభ్యర్థులుగా బరిలో ఉన్నవారిని, వారి అనుచరులను సైతం వదలకుండా బైండోవర్లు చేస్తుండడంతో సొంత పార్టీలోని ఓ వర్గం నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బైండోవర్ల వ్యవహారంపై స్టేషన్ సిబ్బందిని నిలదీస్తే.. మాకేం సంబంధం లేదు, ఎస్‌బీ, ఇంటెలిజెన్స్ ఇచ్చిన వివరాల ప్రకారమే చేస్తున్నామని చేతులెత్తేస్తున్నారు. తీరా ఎస్‌బీ, ఇంటెలిజెన్స్ అధికారులను అడిగితే ఇందులో మా పాత్రేమీ లేదని కొట్టిపారేస్తుండటం గమనార్హం.
గతంలో అరాచకాలు చేసినవారికి
మినహాయింపు?
చిత్తూరు పరిధిలో ఇలాంటి ఏకపక్ష కేసులు మరీ ఎక్కువగా నమోదు అవుతున్నాయి. గతంలో అనేక దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ నేతలు, వారి అనుచరులను స్వేచ్ఛగా తిరగనిస్తూ, బైండోవర్లు చేయకపోవడం వెనుక అంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముందస్తుగా పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా బైండోవర్లు చేసి ఉంటే మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలు చించేయడం, దాడులకు పాల్పడడం వంటి పరిస్థితి వచ్చేది కాదని శాఖలోని కొందరు నిష్పాక్షిక అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల రోజున దాడులకు కుట్ర?
ఎన్నికల రోజున వైఎస్సార్ సీపీ మద్దతుదారులను భయభ్రాంతులకు గురిచేసి దాడులు, దౌర్జన్యాలకు దిగేందుకు స్థానిక టీడీపీ నేతలు పథకం రచన చేసినట్లు నిఘా వర్గాలకు ఇప్పటికే సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది. గొడవలు జరిగినా స్థానిక పోలీసులు ప్రేక్షకపాత్ర వహించేలా బడా నేతల కార్యాలయాల నుంచి హుకుం జారీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. బైండోవర్ల విషయంలో అన్ని పార్టీల వారిపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్న వివరాలన్నీ తప్పుడు సమాచారమేనని, ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ రకమైన ఏకపక్ష వైఖరి వల్ల ఎన్నికల్లో పారదర్శకత లోపించి, శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని, ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చిత్తూరుకు చెందిన కామేష్ (పేరు మార్చాం) అనేక ఏళ్లుగా టీడీపీలోనే క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో పార్టీకి చెందిన ఒక రెబెల్ అభ్యర్థికి మద్దతుగా ఉన్నాడనే నెపంతో అతడిపై బైండోవర్ పేరుతో పోలీసులు వేధింపులు మొదలుపెట్టారు. ఏంటిది అని ప్రశ్నిస్తే పరిస్థితిని అర్థం చేసుకోండంటూ పోలీసులు చేతులెత్తేస్తున్నారు.
వైఎస్సార్ సీపీకి చెందిన మరో వ్యక్తి (వయస్సు 42) బతుకుదెరువు కోసం తమిళనాడులో పనిచేసుకుంటున్నాడు. అతడిపై స్వగ్రామంలో ఎలాంటి కేసులు లేవు. అయినప్పటికీ.. నీపై బైండోవర్ ఉంది, స్టేషన్‌కు రా అంటూ పోలీసుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కూటమి నేతలు కావాలనే కక్షగట్టి ఈ పని చేయిస్తున్నారని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తప్పుడు బైండోవర్లపై చిక్కులు తప్పవు
జిల్లాలో పోలీసులు ఇప్పటికే చాలా చోట్ల తప్పుడు బైండోవర్లు పెట్టారు. గతంలో ఎలాంటి నేరచరిత్ర లేనివాళ్లను కూడా స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు గురిచేస్తున్నట్లు మా లీగల్ సెల్‌కు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికోసమైతే తప్పుడు బైండోవర్లు పెడుతున్నారో వాళ్లు రేపు అధికారంలో ఉండకపోవచ్చు. అప్పుడు తప్పు చేసిన పోలీసులను ఎవరు కాపాడతారు? ఇది పద్ధతికాదు. రేపు పోలీసులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిందే. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించి విధులు నిర్వర్తిస్తే మంచిది. లేకపోతే ప్రైవేటు కేసులు వేయడానికి వెనుకాడేదిలేదు.
– సూర్యప్రతాపరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా న్యాయవిభాగం అధ్యక్షులు.


