ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలి వైఎస్‌ఆర్‌సీపీ చిత్తూరు ఇన్‌చార్జి విజయానందరెడ్డి, చిత్తూరు మేయర్ అభ్యర్థి చంద్రశేఖర్
చిత్తూరు కలెక్టరేట్ : నవంబర్ 1వ తేదీన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, నగర మేయర్ అభ్యర్థి చంద్రశేఖర్ కోరారు. వారు గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, ఎస్పీ తుషార్‌డూడికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత అవసరమని తెలిపారు. ఓటర్లు భయలేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తగినంత పోలీసు బలగాలను నియమించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరా నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను టీడీపీ కూటమికి చెందిన గుండాలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థులందరికీ తగిన రక్షణ కల్పించాలని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలను అరికట్టి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ సానుకూలంగా స్పందిస్తూ.. జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


