పోలింగ్‌ రోజు సెలవు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ రోజు సెలవు

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

చిత్తూరు కార్పొరేషన్‌: మున్సిపాలిటీలు, నగరపాలక పరిధిలో నవంబర్‌ 1వ తేదీన పోలింగ్‌ రోజున కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని సహాయ కార్మిక కమిషనర్‌ కేశన్న ఆదేశించారు. జిల్లాలో ఆ రోజున పోలింగ్‌ జరిగే ప్రాంతంలోని దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు.

నిష్పక్షపాతంగా ఎన్నికలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరపాలక సంస్థతో పాటు పలమనేరు, కుప్పం, నగరి మున్సిపాలిటీల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు ఎస్పీ తుషార్‌ డూడి తెలిపారు. నవంబర్‌ 1న పోలింగ్‌, నవంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల విధుల్లో 1,500 మందికి పైగా పోలీసులను నియమించినట్టు తెలిపారు. సున్నిత, అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, శాంతిభద్రతల పరిరక్షణకు 1,434 మందిని బైండోవర్‌ చేయడంతో పాటు 520 లైసైన్స్‌ ఆయుధాలను డిపాజిట్‌ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి 37 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలతో తనిఖీలు చేస్తున్నట్టు వివరించారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత స్థానికేతర నేతలు ఆయా ప్రాంతాలు విడిచి వెళ్లాలని, లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టినా, బెదిరింపులకు పాల్పడినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎన్నికల వేళ ఏవైనా సమస్యలుంటే కంట్రోల్‌ రూమ్‌ 9440900005 లేదా డయల్‌ 112కు సమాచారం అందించాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

బీఎడ్‌, బీపీఎడ్‌ అనుమతులకు గడువు పొడిగింపు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తూ బీఎడ్‌, బీపీఎడ్‌ కోర్సులు చదివేందుకు అనుమతులు పొందే గడువును పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీచేసిన ఉత్తర్వులు గురువారం డీఈఓ కార్యాలయానికి చేరాయి. బీఎడ్‌, బీపీఎడ్‌ కోర్సులు చదివేందుకు అనుమతి కోరే టీచర్ల ప్రతిపాదనలకు నవంబర్‌ 15వ తేదీ వరకు గడువు పెంచినట్లు పేర్కొన్నారు. టీచర్లు తమ దరఖాస్తులను నిర్ణీత చెక్‌లిస్ట్‌, సర్వీస్‌ రిజిస్టర్‌ స్కాన్‌ కాపీలతో ఈ ఆఫీస్‌లో మాత్రమే పంపాలని స్పష్టం చేశారు. నేరుగా ఇచ్చే ఫైళ్లను అనుమతించమని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశీలించమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నవంబర్‌ 30 వరకు

ఈఎస్‌ఆర్‌ గడువు పొడిగింపు

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రికార్డుల డిజిటల్‌ నమోదు, అప్‌డేట్‌ ప్రక్రియ గడువును నవంబర్‌ 30 వరకు పెంచారని కలెక్టరేట్‌ అధికారులు గురువారం వెల్లడించారు. గతంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈ నెల 31 నాటికి ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈఎస్‌ఆర్‌ అప్లికేషన్‌లో సర్వర్‌ సమస్యలు, ఓటీపీ ధృవీకరణ వైఫల్యాలు తలెత్తడం, ఉద్యోగులు అవసరమైన ధ్రువపత్రాలు సమకూర్చుకోవడానికి సమయం పట్టడం వంటి కారణాలు ఉండడంతో గడుపు పొడిగించినట్టు సమాచారం. అలాగే ప్రస్తుతం కొందరు ఉద్యోగులు పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో, రాష్ట్రపతి ఉత్తర్వుల కేటాయింపు ప్రక్రియల్లో నిమగ్నమై ఉండడం కూడా కారణంగా తెలుస్తోంది. ఉద్యోగులు, అన్ని శాఖలు ఈఎస్‌ఆర్‌కు సంబంధించిన పూర్తి ప్రక్రియను నవంబర్‌ 30 లోపు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement