నగరి: ఓటమి భయంతోనే టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి ఆర్‌కే.రోజా ఆరోపించారు. ఆమె గురువారం సత్రవాడ నుంచి కేవీపీఆర్ పేట, ఏకాంబరకుప్పం, కొత్తపేట, నగరి పట్టణం మీదుగా ఓంశక్తి ఆలయం సమీపం బైపాస్ సర్కిల్ వరకు ఎన్నికల ర్యాలీ చేశారు. కూటమి పార్టీలు ఆడుతున్న రాజకీయ వికృత చేష్టలను ఎండగట్టారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కూటమి పార్టీల దహనకాండకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆమె మాట్లాడుతూ నిజంగా కూటమి ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. చైర్మన్‌ను ఏకగ్రీవం చేసుకోవడం వెనుక రాజకీయ కుట్ర, అధికారుల అండదండలు ఉండడం ప్రజలెరిగిన సత్యమన్నారు. నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ టీడీపీ కార్యకర్తలా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే నగరి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం చేశారని పేర్కొన్నారు. తమ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ పరిశీలనలో ఆమోదం పొందిన తర్వాత, ఫారం 7 ఇచ్చిన తర్వాత దానిని ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు.
చైర్మన్ ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించాం
నగరి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు. తాము దేవుడిని నమ్ముతామని, న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉందని, అక్కడ తమకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికలకు ఒక్కరోజు ముందు రౌడీమూకలను టీడీపీలో చేర్చుకుని నగరిలో రౌడీయిజానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఓటర్లను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నగరి మున్సిపాలిటీని రౌడీలు, దొంగల బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని, ఓటర్ల తీర్పును గౌరవించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీలో జరిగిన అభివృద్ధిని పరిశీలించి ఓటు వేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.


