చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను సమకూరుస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు 1,100 బ్యాలెట్ బాక్సులు కేటాయించగా తొలి విడతగా 390 బ్యాలెట్ బాక్సులు చిత్తూరుకు విచ్చేశాయి. ఈ బాక్సులను జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో అధికారుల పర్యవేక్షణలో అత్యంత భద్రత నడుమ భద్రపరిచారు. ఎన్నికల నిబంధనల ప్రకారం స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన బ్యాలెట్ బాక్సులు కూడా త్వరలోనే జిల్లాకు చేరుకుంటాయని, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సన్నద్ధమవుతున్నామని కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు.


