పేదల పొట్టకొట్టి..
మా పొట్ట కొట్టారు
కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాం. ఎన్నికల సమయంలో వలంటీర్లకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు. అప్పుడు మా పొట్ట కొట్టి.. ఇప్పుడు సోషల్‌మీడియా కార్యకర్తలకు దోచిపెడుతున్నారు. మేము నెలకు కేవలం రూ.5వేల గౌరవ వేతనంతో అహర్నిశలూ ప్రజలకు సేవ చేశాం. కోవిడ్ సమయంలో అందరూ భయపడి ఇంట్లో ఉంటే, మా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇంటింటికీ తిరిగాం. అప్పట్లో మాకు ఇచ్చే రూ.5వేలతో ప్రజాధనం దుర్వినియోగమవుతోందంటూ విషం గక్కారు. ఇప్పుడు సోషల్ మీడియాలో తమకు డప్పు కొట్టే టీడీపీ కార్యకర్తలకు ప్రజాధనం పంచిపెడుతున్నా రు. ఈ విషయంలో ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. – మహమ్మద్, మాజీ వలంటీర్, చిత్తూరు
మహిళలను వంచించారు
ఎన్నికల ముందు ఆడబిడ్డ నిధి అని ఆశ పెట్టారు. గెలిచాక మహిళల ఖాతాలకు రూపాయి కూడా వేయడం లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ రూ.1,500 చొప్పున ప్రతి నెలా ఇస్తామనే మాటలు నమ్మి ఓట్లేశాం. ప్రభుత్వంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఆడబిడ్డ నిధి జాడే లేదు. ఇప్పుడు పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు పెరిగిపోయి కుటుంబ నిర్వహణ భారంగా మారింది. ఆడపిల్లల చదువులకు, ఇంటి ఖర్చులకు ఆసరాగా ఉంటుందనుకుంటే ఒక్క పైసా ఇవ్వడం లేదు. మ హిళలను పూర్తిగా వంచించారు. పైగా సోషల్ మీడి యా ఇన్‌ఫ్ల్యూన్సర్స్ పాలసీ అని నగదు దోచిపెట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. – సుజాత, గృహిణి
చంద్రబాబు సర్కారు వ్యవహారశైలిపై ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు నగదు పంపిణీ చేయాలనుకోవడంపై మండిపడుతున్నారు. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయకుండా ఆర్థిక భారమంటూ కథలు వల్లించి.. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు పప్పుబెల్లాల లెక్కన నిధులు పంచిపెడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇంటింటికీ వెళ్లి చిత్తశుద్ధితో సేవలందించిన వలంటీర్లకు ద్రోహం చేసి.. ఇప్పుడు సొంత డబ్బా కొట్టించుకునేందుకు ప్రజాధనం ఖర్చుపెడుతుండడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. – సాక్షి నెట్‌వర్క్


