చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ స్పష్టం చేశారు. మంగళవారం చిత్తూరులోని జింకల పార్కు వద్ద సైన్ మ్యూజియాన్ని ఆయన సందర్శించారు. జిల్లా సైన్స్ మ్యూజియంలో ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించే పలు ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు. ప్రతి రోజు పలు పాఠశాలల నుంచి విద్యార్థులు సైన్స్ మ్యూజియాన్ని సందర్శించేలా చర్యలు చేపడుతున్నారు. అయితే మ్యూజియం ప్రాంగణంలో ముళ్ల కంపలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాములు సంచరిస్తుండడంతో జేసీబీ సహాయంతో వాటిని తొలగించేందుకు మ్యూజియం అధికారులు చర్యలు చేపట్టారు. ఆ పనులను చేయకూడదంటూ అటవీ శాఖ రేంజర్ అడ్డుకోవడంతో సమస్య ఏర్పడింది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో ఆయన తనిఖీలు నిర్వహించారు. సైన్స్ మ్యూజియం ప్రాంగణంలో పనులను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న పనికీ అనుమతులు కావాలని చెప్పడం సబబు కాదన్నారు. అటవీశాఖ అధికారులు తీరు మార్చుకుని సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. సైన్స్ మ్యూజియంలో విద్యాశాఖ అధికారులు చేపట్టే పనులకు ఆటంకం కలిగించకూడదని జిల్లా అటవీశాఖ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ లక్ష్మీనారాయణ, మ్యూజియం క్యూరేటర్ జయంతి పాల్గొన్నారు.


