మద్యం సిండికేట్లు | - | Sakshi
Sakshi News home page

మద్యం సిండికేట్లు

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

వ్యాపారులతో కుమ్మకై ్కన టీడీపీ నేతలు

ప్రభుత్వ ఖజానాకు గండికొట్టడమే లక్ష్యంగా పావులు

చివరి రోజునే అప్లికేషన్లు వేసేందుకు పన్నాగాలు

అధికారమే అండగా జిల్లాలో కొందరు ప్రజా ప్రతినిధులు సొంత లాభం కోసం, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. జిల్లాలో మద్యం దుకాణాల నిర్వహణకు లైసెన్సులు ఇవ్వడానికి ఆహ్వానించిన నోటిఫికేషన్‌కు ఒక్క దరఖాస్తు కూడా రాకుండా వ్యాపారులను సిండికేట్‌ చేసేశారు. ఇప్పటికే దుకాణాలు దక్కించుకుని, రెండేళ్ల పాటు సంపాదించుకున్న వారందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చేశారు. చివరి రోజునే అప్లికేషన్లు వేసి మొత్తం 18 వైన్‌షాపులను చేజిక్కించుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నారు.

చిత్తూరులోని ఓ మద్యం దుకాణం

సాక్షి, చిత్తూరు : జిల్లాలో 113 మద్యం దుకాణాల రెన్యూవల్‌కు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది., ఇందులోని లొసుగు తెలియని 95 మంది సగటున ఒక్కో దుకాణానికి రూ.25 లక్షలు చెల్లించి రెన్యూవల్‌ చేసుకున్నారు. మిగిలిన 18 దుకాణాల నిర్వాహకులు రెన్యూవల్‌కు వెళ్లకపోవడంతో కొత్తగా లైసెన్సులు ఇవ్వడానికి అధికారులు గురువారం నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయితే ఒక దుకాణానికి రూ.3 లక్షల నాన్‌ రీఫండబుల్‌ రుసుము కింద, కనీసం ఒక్కో దుకాణానికి నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా పడితేనే లక్కీడిప్‌ తీస్తామని నిబంధన పెట్టారు. అంటే ఒక దుకాణం కోసం నాలుగు దరఖాస్తులు పడితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.12 లక్షలు. రూ.25 లక్షలు చెల్లించి రెన్యూవల్‌ చేసుకోవడానికి బదులుగా, రూ.12 లక్షలు చెల్లించి తామే నాలుగు దరఖాస్తులు వేసుకుంటే సరిపోతుందని భావించిన వ్యాపారులు పాలసీలోని లొసుగును కనిపెట్టేశారు. రూ.12 లక్షలకంటే రూపాయి కూడా ప్రభుత్వానికి ఆదాయం వెళ్లకుండా ఉండేందుకు కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడ్డారు.

చివర్లో దరఖాస్తులు

సిండికేట్‌ చెప్పినట్లే ఈనెల 30వ తేదీ వరకు ఎవరూ దరఖాస్తు చేయకూడదని తీర్మానం చేయడంతో.. ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేదు. 30వ తేదీ, అక్టోబర్‌ 1వ తేదీన ఒకేసారి దరఖాస్తులు చేసుకోవాలన్న సిండికేట్‌ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉన్నారు. వచ్చిన దరఖాస్తులను 5వ తేదీన చిత్తూరులోని కలెక్టరేట్‌లో లక్కీడిప్‌లో లైసెన్సులు కేటాయించడమే తరువాయి. అయితే అధికార పార్టీ నేతలే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు తెగబడడంపై ఆబ్కారీశాఖ అధికారులు, ప్రజలు నివ్వెరబోతున్నారు.

జిల్లాలోని 18 వైన్‌ షాపులకు రాని దరఖాస్తులు

నేతల అభయం

ఈనెల 24వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌లో చిత్తూరు కార్పొరేషన్‌లో 9, యాదమరి 1, పూతలపట్టు 2, నిండ్ర 1, వి.కోట 3, బైరెడ్డిపల్లె 1, శాంతిపురంలో ఒక దుకాణం చొప్పున.. మొత్తం 18 దుకాణాలకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. అలాగే పెద్దపంజాణి మండలంలో కల్లుగీత సామాజిక వర్గంలోని గౌడ్లలకు ఓ మద్యం దుకాణ నిర్వాహణకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. అక్కడ ఆ సామాజిక వర్గం లేపోవడంతో గత రెండేళ్లుగా లైసెన్సు ఎవరికీ ఇవ్వలేదు. కాగా, 18 దుకాణాలకు దక్కించుకోవడానికి కొందరు వ్యాపారులను ఆయా నియోజకవర్గాల్లోని ప్రజా ప్రతినిధులు తమ వద్దకు పిలిపించుకున్నారు. తమ చెప్పకుండా ఎవరూ దరఖాస్తులు వేయడానికి వీల్లేదని, అందరూ సిండికేట్‌గా ఏర్పడాలని ఆదేశించారు. రూ.12 లక్షలకే దుకాణం తీసుకుని, ఆపై వేలం పాట నిర్వహించి వచ్చే అదనపు ఆదాయాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి కొందరు నేతలు వాటాలు తీసుకుంటుండగా, మరికొందరు దుకాణాలను బినామీ పేరిట తామే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement