– మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
శ్రీరంగరాజపురం:కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ పక్షపాత వైఖరి సరికాదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. సోమవారం పుత్తూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్ బీజేపీకి కొమ్ముకాయడం, వారికి అనుకూలంగా వ్యవహరించడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమే విమర్శించారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనా మా చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఓటింగ్ లేదా ప్రధానమంత్రి, సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష పార్టీలతో చర్చించి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించాలని సూచించారు. రాష్ట్రంలో సైతం ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, సచివాలయ ఉద్యోగులపై లాఠీ చార్జి చేయించడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే దాడి చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. జగనన్న పాలనలో 1.50 లక్షల మందికి పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చామని,చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ పేరుతో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. జగనన్న ప్రభుత్వం రాగానే డీఎస్సీ నియామకాలపై విచారణ చేయిస్తామని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియా వ్యక్తులకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు ఇవ్వడం ఎక్కడా చూడలేదన్నారు. మాజీ మంత్రి ఆర్‌కే రోజాపై తప్పుడు పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడి యా వ్యక్తులకు జీతాలు చెల్లించాలని కేబినెట్‌లో తీర్మా నం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని విమర్శించారు.


