కుప్పం : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు కుప్పం నుంచి ఆర్‌టీసీ బస్సులను తరలించారు. ఒక్కసారిగా 38 సర్వీసులు వెళ్లిపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. కళాశాల, పాఠశాల నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు సర్వీసులు లేకపోవడంతో పిల్లలు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. మంగళవారం నెల్లూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. దీంతో కుప్పం నుంచి పలమనేరు వైపునకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులను సైతం నెల్లూరుకు పంపించారు. ఈ క్రమంలో సోమవారం నుంచి బుధవారం వరకు కుప్పం డిపోకు చెందిన 38 బస్సులు అందుబాటులో ఉండని పరిస్థితి. నిత్యం సాయంత్రం వేళ పల్లె వెలుగు, ఆర్డినరీ సర్వీసులు కుప్పం డిపో నుంచి సకాలంలో నడవడం లేదు. దీనికి తోడు మూడు రోజుల పాటు 38 బస్సులు లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు విద్యార్థులు తిరుగు ప్రయాణమయ్యేందుకు బస్టాండుకు వచ్చారు. అక్కడ బస్సులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. దీనిపై డిపోలో సమాధానం చెప్పేవారు కూడా లేకపోవడంతో పిల్లలక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించింది.


