ఇన్‌ సర్వీస్‌ దరఖాస్తుకు గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఇన్‌ సర్వీస్‌ దరఖాస్తుకు గడువు పొడిగింపు

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్‌జీటీ, పీఈటీ ఉపాధ్యాయులు ఇన్‌న్‌సర్వీస్‌లో బీఈడీ, బీపీఈడీ కోర్సులు చేసేందుకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అర్హత, ఆసక్తి గల టీచర్లు దరఖాస్తులను సమర్పించేందుకు అక్టోబర్‌ 31వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అర్హులైనవారు తమ దరఖాస్తు ప్రతిపాదనలను సంబంధిత డీడీఓలతో గడువులోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించమని స్పష్టం చేశారు.

వీడియో మార్ఫింగ్‌పై ఫిర్యాదు

విజయపురం (నగరి) : మాజీ మంత్రి ఆర్‌కే రోజా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తున్న వీడియోను కొందరు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ విజయపురం మండలం నేతలు కోరారు. సోమవారం ఈ మేరకు చిత్తూరులో ఎస్పీ తుషార్‌ డూడీకి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంజు బాలాజీ, వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగం జిల్లా సెక్రటరీ జిల్లు, మాజీ సర్పంచ్‌లు భాస్కర్‌రెడ్డి, శ్రీరాములు రెడ్డి, బాబు, యువజన నేత ప్రకాష్‌ పాల్గొన్నారు.

డీటీల డ్రాఫ్ట్‌ సీనియారిటీ జాబితా విడుదల

– అభ్యంతరాలకు అక్టోబరు 3 వరకు గడువు

చిత్తూరు కలెక్టరేట్‌ : రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ల (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, ప్రమోటీలతో సహా) స్థానిక కేడర్‌ కేటాయింపుల ప్రాతిపదికన డ్రాఫ్ట్‌ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు పభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు ఉత్తర్వులు పంపారు. రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ప్రకారం ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్వహణ, కేటాయింపుల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని డిప్యూటీ తహసీల్దార్ల (ప్రొబేషన్‌, సస్పెన్షన్‌, ఈఓఎల్‌, డిప్యుటేషన్‌, శిక్షణలో ఉన్నవారిని కలిపి) వివరాలతో జోనల్‌ సీనియారిటీ డ్రాఫ్ట్‌ జాబితాను రూపొందించినట్లు పేర్కొన్నారు. సంబంధిత జాబితాను ఈ నెల 28వ తేదీన జిల్లా స్థాయిలో ప్రచురించాలని ఆదేశించారు. అక్టోబరు 3వ తేదీ నాటికి అభ్యంతరాలను స్వీకరించాల్సిందిగా స్పష్టం చేశారు. ఈ డ్రాఫ్ట్‌ సీనియారిటీ జాబితా కేవలం స్థానిక కేడర్ల కేటాయింపు అవసరాల కోసమేనని, ఇది ఉద్యోగుల సర్వీస్‌ సీనియారిటీకి ఎలాంటి హక్కును కల్పించదని ఉత్తర్వుల్లో వెల్లడించారు. అభ్యంతరాలు ఉన్న ఉద్యోగులు తగిన ఆధారాలతో నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

బాధ్యతగా ఫిర్యాదుల పరిష్కారం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఎలాంటి అలసత్వం వహించకూడదని, నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తిచేసి బాధ్యతగా బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ తుషార్‌ డూడీ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, చట్టబద్ధంగా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీతో పాటు నాన్‌ కేడర్‌ ఎస్పీ రాజశేఖర్‌ రాజు, అడిషనల్‌ ఎస్పీ ఎస్‌ షాను, డీఎస్పీ జె.వెంకటనారాయణను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. గ్రీవెన్స్‌లో మొత్తం 84 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement