చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న వినాయకస్వామి
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ప్రత్యేక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం వినాయకస్వామివారు చంద్రప్రభవాహనంపై విహరించారు. ఈ సందర్భంగా తొలుత మూలవిరాట్‌కు విశేషాభిషేకం జరిపించారు. చందన అలంకారం చేసి విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన ప్రాప్తి కల్పించారు. రాత్రి అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి వారి ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం చేశారు. సుగంధభరిత పుష్పాలు, పట్టుపీతాంబరాలతో అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం చంద్రప్రభవాహనంపై కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రప్రభ వాహన సేవలో భాగంగా ఉభయకర్తలు క్షీర కలశాలతో ఊరేగింపు చేపట్టారు. ప్రధాన ఆలయ కల్యాణ వేదికలో ఉత్సవమూర్తికి పాలాభిషేకం చేశారు.


