ఎవరికెన్ని వార్డులంటే..
అధికారులు ప్రచురించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ప్రకారం ఆయా వర్గాలకు ఎన్ని వార్డులు కేటాయించాలన్న దానిపై నిబంధలన మేరకు స్పష్టత ఉంది. మునిసిపాలిటీల్లో ఉన్న మొత్తం వార్డుల సంఖ్యలో ఎస్టీ 1 శాతం, ఎస్సీ 16 శాతం, బీసీ 34 శాతం (అంచనా) వార్డులను రిజర్వు చేయాలి. అంటే చిత్తూరు కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉంటే ఎస్టీలకు ఒక డివిజన్, ఎస్సీలకు 10, బీసీలకు 20 డివిజన్లు రిజర్వు చేస్తారు. మిగిలినవి అన్–రిజర్వు (ఓపెన్ కేటగిరీ) కిందకు వస్తాయి. 60 డివిజన్లలో 30 డివిజన్లను తప్పనిసరిగా మహిళలకు రిజర్వు చేస్తారు. ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే తుది వాదనలు విన్న హైకోర్టు మూడు రోజుల క్రితం తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. కోర్టు వెలువరించే తీర్పు, ఎన్నికల నిర్వహణను ముందుకు తీసుకెళ్లాలా..? ‘సర్’ పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహించాలా..? అనే దానిపై ఆధారపడుతుంది. అప్పటి వరకు ఉత్కంఠత తప్పేలా లేదు.
మునిసిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఒక్కో అంశాన్ని అధికారులు పూర్తి చేస్తున్నారు. మునిసిపల్ కమిషనర్లు ఇప్పటికే వార్డుల పునర్విభజన, వార్డుల వారి ఓటర్ల జాబితా ప్రచురించారు. తాజాగా జిల్లాలోని మునిసిపాలిటీల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను వార్డుల వారిగా ఆదివారం విడుదల చేశారు.
సాక్షి, చిత్తూరు: జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, నగరి మునిసిపాలిటీల్లో ఎన్నికల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చిత్తూరు కార్పొరేషన్‌లోని 60 డివిజన్లు, పలమనేరు మునిసిపాలిటీలోని 36 వార్డులు, నగరిలోని 40 వార్డుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను వార్డుల వారిగా ప్రచురించారు. ఈ ప్రతులను స్థానిక మునిసిపల్ కార్యాలయతో పాటు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. అలాగే రాజకీయ పార్టీలకు సైతం జాబితా పంపించారు. మొత్తం 136 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు ప్రాథమికంగా లెక్క కట్టారు. ఈ జాబితాపై సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు అభ్యంతరాలను ఆయా మునిసిపల్ కమిషనర్లకు తెలియజేయాల్సి ఉంటుంది.
రేపటి నుంచి విచారణ
కులాల వారిగా ప్రచురించిన జాబితాలో ఏవైనా అభ్యంతరాలు, సవరణలు చేయాలంటే ఈ నెల 29, 30వ తేదీల్లో ఇంటింటా వెళ్లి విచారణ చేపడతారు. వచ్చిన అభ్యంతరాలపై విచారణ పూర్తి చేసి, సహేతుకంగా ఉన్న వాటిని ఆమోదిస్తారు. అక్టోబర్ 1వ తేదీన తుది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వార్డుల వారి జాబితాను ప్రచురిస్తారు. ఆపై దీన్ని రాష్ట్ర మునిసిపల్ సంచాలకులకు (డీఎంఏ) అందజేస్తారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే చిత్తూరు కలెక్టర్ గెజిట్ విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు జిల్లాలోని ఏయే మునిసిపాలిటీల్లో ఏయే వార్డులు రిజర్వు చేసారనే వివరాలను గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంటారు. తుదిగా మేయర్, చైర్‌పర్సన్ రిజర్వేషన్లను విడుదల కావడం, ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ విడుదల కావడమే తరువాయి.


