– మూడు బైక్‌లు, 280 కిలోల రాగి వైరు స్వాధీనం
కుప్పం: గుడుపల్లె మండలం పొగరుపల్లి ఇండస్ట్రియల్ ఏబీఐఎస్ కంపెణీలో కాపర్ వైర్లను చోరీ చేసిన దొంగలను అరెస్టు చేసినట్టు కుప్పం ఏఎస్పీ హేమంత్ బోడ్డు తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఇండస్ట్రియల్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తు న్నా ఫ్యాక్టరీల్లో కాపర్ వైర్లు చోరీకి గురైనట్టు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. సీసీ పుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులకు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి 280 కేజీల రాగి వైర్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. నిందితులు కర్ణాటక రాష్ట్రం బట్లహళ్లి గ్రామానికి చెందిన మధు, సంతోష్, మురుగన్, విజయ్‌గా గుర్తించామని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీఐ మల్లేష్‌యాదవ్, గుడుపల్లె ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.
1న ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా
తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అక్టోబర్ ఒకటో తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కళాశాలలో 2023 నుంచి 2026 లోపు డిప్లొమాలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. జాబ్‌మేళాకు శ్రీసిటీ సహా 6 ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు హాజరై సుమారు 300 రకాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 6303578886లో సంప్రదించాలని సూచించారు.
నేటి నుంచి మూడు రోజులు బ్యాంకుల బంద్
కాణిపాకం : వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు సమస్యల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమర శంఖం పూరించారు. సోమ, మంగళ, బుధవారాల్లో సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. వారం రోజుల పనిదినాలను 5 రోజులకు కుదించి, శనివారాన్ని కూడా సెలవు దినంగా ప్రకటించాలని బ్యాంకర్లు గత 10 నుంచి 12 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని, పీఎల్‌ఐ తదితర బకాయిలు చెల్లించాలని కోరుతూ సమ్మెకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపునిచ్చింది.
జిల్లా వ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు
సమ్మె ప్రభావంతో జిల్లా పరిధిలో ఉన్న వివిధ బ్యాంకులకు చెందిన దాదాపు 250 శాఖలు మూతపడనున్నాయి. బ్యాంకు ఆఫీసర్లు, క్లర్కులు, ఇతర సిబ్బంది కలిపి సుమారు 400 నుంచి 500 మంది విధులకు దూరంగా ఉండి నిరసనలో పాల్గొంటున్నారు. మూడు రోజులు బ్యాంకు లావాదేవీలు నిలిచిపోనుండడంతో జిల్లాలోని వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యాలు నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని ఉద్యోగ సంఘాల నాయకులు తేల్చిచెప్పారు.
ఈ–బస్ డిపో పరిశీలన
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతి మంగళం ఆర్టీసీ డిపోను ఆదివారం జోన్–4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఆర్.కె.కిషోర్ సందర్శించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పనుల పురోగతిని పరిశీలించారు. పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయా లని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్, డిప్యూటీ సీఎంఈ బాలాజీ, డిప్యూటీ చీఫ్ డిపో మేనేజర్ బి.నిర్మల, ఏఈ (సివిల్) ప్రతాప్, ఏఈ (ఎలక్ట్రికల్) హరి పాల్గొన్నారు.
ఇంట్లో అగ్నిప్రమాదం : వ్యక్తి మృతి
తిరుపతి క్రైం : కొర్లగుంట అశోక్‌నగర్‌లోని ఓ ఇంట్లో శనివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. శ్రీకాళహస్తి పట్టణం, కొండమిట్టకు చెందిన మర్రి హరికృష్ణ (54) తిరుపతిలో ఉంటూ శ్రీచక్ర ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున హరికృష్ణ ఉంటున్న ఇంటి నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఇంట్లో పరిశీలించగా హరికృష్ణ మృతి చెంది కనిపించాడు.


