చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక)ను రద్దు చేశారు. ఈ మేరకు ఆదివారం కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఈ నెల 21, 22 తేదీల్లో సీఎం చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన ఉండడంతో పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి వ్యయప్రయాసలకు ఓర్చి కలెక్టరేట్‌కు రావద్దని అధికారులు కోరారు.
సీఎం పర్యటన ప్రదేశాల పరిశీలన
కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 21, 22 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ తుషార్ డూడి ఆదివారం శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి గ్రామం వద్ద చేపట్టనున్న జలహారతి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కుప్పం మున్సిపాలిటీ తంబిగానిపల్లి వద్ద శంకుస్థాపన చేయనున్న రైతు బజార్ స్థలాన్ని, కొత్తపేటలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. రైల్వే స్టేషన్‌లో దాదర్–పుదుచ్చేరి రైలు కుప్పం హాల్ట్ ప్రదేశాలను పరిశీలించారు. కడపల్లి వద్ద పార్టీ కేడర్ సమావేశంలో సీఎం పాల్గొనుండడంతో ఆయా ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సీఎం పర్యటన లైజెన్ ఆఫీసర్ వెంకటేష్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, సీఎం పీఏ శ్రీకాంత్, పీఎస్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.
విఘ్నేశ్వరుడికి
1,516 కేజీల లడ్డూ ప్రసాదం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం డీఐ రోడ్డులో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరుగుతున్నాయి. 50వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు తొలి సారిగా 1,516 కేజీల భారీ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయించి విఘ్నేశ్వరుడికి సమర్పించారు. ఆదివారం సాయంత్రం పొన్నియమ్మ గుడివీధిలోని వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా లడ్డూను డీఐ రోడ్డులోని గణపతి మండపానికి తీసుకెళ్లారు. సెప్టెంబర్ 14న పండగ రోజున ఏకంగా 50 విగ్రహాలను ప్రతిష్టించి రోజు వారీ అన్నదానాలు, సహస్ర గణపతి హోమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.


